IT Raids In BBC Office :  బీబీసీ నెట్‌వర్క్‌కు చెందిన ఢిల్లీ , ముంబై ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు సంబంధించి హిందీ, తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల డిజిటల్ విభాగాలు ఢిల్లీ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ముంబైలోనూ కొన్ని ప్రాంతీయ భాషల విభాగాల  ఆఫీసులు ఉన్నాయి. దాదాపుగా 60, 70 మంది ఐటీ అధికారులు ఒక్క సారిగా ఢిల్లీ ఆఫీసులోకి వచ్చి ఉద్యోగులందరి దగ్గర ముందుగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సోదాలు ప్రారంభించారు.  



ఆఫీసు ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకపోవడంతో.. సోదాల విషయంపై రహస్యంగా ఉంది. ఐటీ అధికారులు ఇటీవలి కాలంలో బీబీసీ ఆదాయ, వ్యయాల గురించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి భారత  బీబీసీ విభాగాలకు వస్తున్న విరాళాలు... నిధులతో  పాటు వాటికి సంబంధించిన సోర్స్ ను ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల బీబీసీ విషయంలో కేంద్రం ఆగ్రహంతో ఉంది. గుజరాత్ లో గోద్రా అల్లర్లకు సంబంధించిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ ఆన్ లైన్‌లో విడుదల చేసినప్పటి నుండి కేంద్రం ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ఐటీ దాడులతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. 


బీబీసీపై ఐటీ దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.  'మొదట బీబీసీ డాక్యుమెంటరీ వచ్చింది, దాన్ని నిషేధించారు. ఇప్పుడు బీబీసీపై ఐటీ దాడులు చేసింది. అప్రకటిత ఎమర్జెన్సీ..అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. 





తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఈ దాడులపై సెటైరికల్‌గా స్పందించారు.  అదానీ అంశంతో ముడిపెట్టి విమర్శించారు. 





లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బీబీసీ చాలా ఏళ్లుగా భారత్ లో  కార్యకలాపాలు నిర్వహిస్తోంది.   ఇటీవల బీబీసీ ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ అల్లర్లు (2002) గురించి ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది, దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.  బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ప్రచారాస్త్రంగా అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీ ఏకపక్ష దృక్పథాన్ని చూపిస్తోందని, అందుకే ప్రదర్శనను నిషేధించినట్లు భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ పలు యూనివర్సిటీలు, కాలేజీల్లో దీన్ని ప్రదర్శించారు. ఢిల్లీలోని జేఎన్ యూలో తీవ్ర కలకలం రేగింది.