4 Years Of Pulwama Attack: పుల్వామా ఘటన జరిగి సరిగ్గా నేటికి నాలుగు సంవత్సరాలు అవుతోంది. 2019 జనవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోయింది. వీరసైనికులను తలుచుకుంటూ దేశ ప్రజల గుండెల్ని పిండేసిన ఈ ఆరోజును భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేరు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజున జాతీయ రహదారి 44పై భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 76వ బెటాలియన్ కు చెందిన 40 మంది సెంట్రల్ సీఆర్పీఎఫ్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. మరో 35 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 


10 నిమిషాల పాటు రాళ్లు రువ్వి మరీ దాడి


ఈ ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కూడా చనిపోయాడు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్.. తన కారును జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్ కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపురా సమీపంలో లాటూ గుండా అతడు వచ్చిన పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అనంతరం సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది.. మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహనాన్ని ఢీకొట్టాడు. ఆత్మాహుతి దాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వానహ శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే ఆదిల్ పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్డాడు.


ప్రతీకారం తీర్చుకున్న భారత్


ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి పాకిస్థాన్ కేంద్రంగా జరిగినట్లు ఆరోపించింది. దాడి అనంతరం పాకిస్థాన్ ను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పై భారత్ కఠినమైన ఆంక్షలను విధించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీని భారత్ 200 శాతానికి పెంచింది. మనీలాండరింగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో చేర్చాలని కోరింది. అనంతర కాలంలో ఆ సంస్థ పాకిస్థాన్ ను గ్రే లిస్టులో చేర్చింది. అంతేకాకుండా 2019 ఫిబ్రవరి 26వ తేదీన భారత్ బాలకోట్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రయిక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఘటనలో 300 మంది ఉగ్రవాదులు మరణించారు. పుల్వామా ఘటనలో సూసైడ్ బాంబర్ ఆదిల్ ఆహ్మద్ కు ఇచ్చిన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్ ను కూడా భద్రతా దళాలు మట్టుబెట్టారు.