Imran Khan Attack:


కాల్పులు..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై దాడి జరగటంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఓ మార్చ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరగ్గా ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఇది జరిగిన మరుక్షణం నుంచే ఇమ్రాన్ వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. చూస్తుంటే...పాక్‌లో మరోసారి పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధానికీ దారి తీయొచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ఒత్తిడిని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎలా తట్టుకుంటుంది..? ఇమ్రాన్ వర్గీయులు ఒక్కసారిగా అల్లర్లు సృష్టిస్తే వాటిని ఎలా అదుపు చేస్తుంది..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగో లేదు. ఇలాంటి కష్టకాలంలో ఇమ్రాన్‌ఖాన్‌పై దాడి జరగటం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 


ఇమ్రాన్ ర్యాలీ దేనికి..? 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా Hakiqi Azadi Marchను అక్టోబర్ 28న ప్రారంభించారు.. ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను వినిపించారు. నిజానికి...ఈ మార్చ్‌పై దాడి జరిగే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. అయినా...దాడి జరిగింది. మరోసారి ప్రధాని కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్‌పై అటాక్ జరగటం అక్కడ సంచలనమైంది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలాలో వందలాది మంది మద్దతుదారుల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తుండగా దాడి జరిగింది. కొన్ని బుల్లెట్‌లు ఇమ్రాన్ ఖాన్‌ కాల్లోకి దూసుకుపోయాయి. ఇమ్రాన్ పక్కనే ఉన్న నేతలకూ గాయాలయ్యాయి. 
దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ జరిపారు. ఈ విచారణలో...తాను ఇమ్రాన్‌ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చానని అంగీకరించాడు నిందితుడు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని అందుకే చంపాలనుకున్నానని వివరించాడు.    


నెక్ట్స్ ఏంటి..? 


నిజానికి...ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో కొంత మేర సక్సెస్ అయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఈ ఉద్యమం పీక్స్‌లో ఉందనగా ఆయనపై దాడి జరిగింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని సింపథీ కోసం ప్రయత్నించే అవకాశముంది. అంతే కాదు...షహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతుని కూడగట్టుకునేందుకూ ప్రయత్నించవచ్చు. ఇక ఇమ్రాన్ మద్దతుదారులు దేశంలో అలజడి సృష్టిస్తే ప్రచ్ఛన్న యుద్ధమూ తప్పదు. లేదంటే...షహబాజ్ చేతులు ఎత్తేసి పూర్తి అధికారాలను సైన్యానికి అప్పగించవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా...పాకిస్థాన్ కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఈ మధ్యే FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డ ఆ దేశానికి...ప్రస్తుత పరిణామాలు పెద్ద దెబ్బే అవుతుండొచ్చు. పదేపదే సైన్యాన్ని తప్పు పడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ను అణిచివేసేందుకు...షహబాజ్ ప్రభుత్వం ఆ సైన్యాన్నే అడ్డు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుత దాడితో ఇమ్రాన్‌ ఖాన్‌కు సింపథీ అయితే దక్కుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయనకు రాజకీయంగా మంచి మైలేజ్ ఇచ్చే అంశమే. మరో వారం పది రోజుల్లో పాకిస్థాన్‌లో రాజకీయాలు ఎలా మారతాయో గమనించాలి. 


Also Read: Pakistan Gunjrawala Firing: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు!