Pakistan Gunjrawala Firing: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన గాయపడినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
గుజ్రాన్‌వాలాలో గురువారం జరిగిన పీటీఐ పార్టీ 'లాంగ్ మార్చ్' కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కంటైనర్‌పై దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన గాయపడ్డారు. దీంతో ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో పీటీఐ నేత ఫైసల్ జావేద్ సహా పలువురు గాయపడ్డారని డాన్ న్యూస్ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎదురుదెబ్బ
తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇటీవల భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది పాకిస్థాన్ ఎన్నికల సంఘం. దీంతో జాతీయ అసెంబ్లీ నుంచి ఇమ్రాన్ ఖాన్ అనర్హత వేటుకు గురయ్యారు.
ఇదే రీజన్
తోషాఖానా కేసులో ఇమ్రాన్ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఈసీ తేల్చింది. దీంతో ఆర్టికల్ 63(1)(p) ప్రకారం ఆయనపై ఐదేళ్ల పాటు బ్యాన్ విధిస్తున్నట్లు పీఈసీ ప్రకటించింది. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. అంతేకాకుండా అయిదేళ్ల వరకు ఆయన పార్లమెంట్ ఎన్నికకు అనర్హుడు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సికందర్ సుల్తాన్ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవంగా బెంచ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.
అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 (1) (p) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా దానికి అర్హత ఉండదు.
చర్యలు కూడా
ఈ తీర్పు ప్రకారం తోషాఖానా కేసులో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఇమ్రాన్‌పై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం. తోషాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు ఇచ్చే ఖరీదైన బహుమతుల్ని ఆ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎవరికి గిఫ్ట్స్ వచ్చినా ఆ విషయాన్ని కేబినెట్‌కు చెప్పాల్సి ఉంటుంది. కానీ పీటీఐ ప్రభుత్వం హయాంలో ఇమ్రాన్‌కు వచ్చిన బహుమతుల లెక్క తేలలేదు.
అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పును పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) ఖండించింది. ఇమ్రాన్‌ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని పీటీఐ నేతలు తెలిపారు.
Also Read: Jharkhand CM Hemant Soren: 'ప్రశ్నించడం ఎందుకు? అరెస్ట్ చేయండి'- ఈడీకి సీఎం హేమంత్ సొరేన్ సవాల్