ప్రపంచవ్యాప్తంగా విచిత్రమైన ఆచారాలు.. వింత పోకడలను మనం వింటుంటాం. వాటిలో చాలా బాధాకరమైన సంప్రదాయాలు కూడా ఉంటాయి. అటువంటి వాటి కోవలోకే వస్తుంది ఈ వింత ఆచారం. ఇక్కడి స్త్రీలు భయానకమైన శారీరక బాధను ఎప్పటి నుంచో అనుభవిస్తోంది. కుటుంబంలోని వ్యక్తి మరణించిప్పుడు, ఆ కుటుంబంలోని మహిళ వేలిని కత్తిరించేస్తారు.
ప్రపంచంలో మనం వినే వింత ఆచారాలు.. సంప్రదాయాలు కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యానికి, గగుర్పాటుకు గురిచేస్తాయి. ఒక సంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత జంటను ఓ గదిలో బంధించేస్తారు. చివరికి వారు శౌచాలయాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఇవ్వరు. మరో సంప్రదాయం ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు అతని బూడిదతో సూప్ తయారు చేస్తారు. ఇలాంటిదే మరో వింత సంప్రదాయం కూడా ఉంది. దీని ప్రకారం కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే, అతని మరణం తర్వాత ఆ కుటుంబంలోని మహిళ వేలిలో కొంత భాగం కత్తిరిస్తారు. అలా ఆ కుటుంబంలో ఎంత మంది మరణిస్తే, ఆ మహిళ వేళ్లు అన్ని సగం మిగిలి ఉంటాయి.
ఈ వింత ఆచారం గురించి విన్న తర్వాత ఇంతటి బాధాకరమైన సంప్రదాయాన్ని ఎక్కడ అనుసరిస్తారు.. అలా చేయడం వెనుక కారణాలు ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కదూ! దీంతో పాటు ఈ వింత ఆచారంలో కొన్ని నియమాలను కూడా పాటిస్తారు.
అసలేంటీ బాధాకరమైన సంప్రదాయం?
మనం విన్న ఈ బాధాకరమైన సంప్రదాయాన్ని ఇండోనేషియా దేశంలోని ఓ తెగ అనుసరిస్తోంది. ఈ ఆచారాన్ని వారు చాలా కాలం నుంచి పాటిస్తున్నారు. ప్రియమైన వారు మరణించిప్పుడు చాలా బాధపడతాం. కొందరు మానసికంగా కుంగిపోతారు. కానీ ఈ తెగకు చెందిన మహిళలు శారీరక బాధ కూడా అనుభవిస్తారు. వివిధ నివేదికల ప్రకారం, ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ తెగలో ఎవరైనా మరణించినప్పుడు, ఆ కుటుంబానికి చెందిన మహిళలు ఈ బాధాకరమైన శిక్షను ఎదుర్కోనాల్సి వస్తోంది. ఈ ఆచారంలో భాగంగా కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత ఆ కుటుంబంలోని మహిళల చేతి వేలిని సగానికి కత్తిరించేస్తారు.
అత్యంత భయానక విషయం ఏమిటంటే ఈ సంప్రదాయాన్ని ఆ కుటుంబంలోని మహిళలు ఒక్కసారి మాత్రమే కాదు. చాలాసార్లు దీన్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆ కుటుంబంలోని వ్యక్తులు మరణించినప్పుడల్లా వారు ఈ శిక్షను అనుభవిస్తున్నారు. వారి వేలును కత్తిరించిన తర్వాత, దానిని ఎక్కడో పాతిపెట్టడం కానీ, కాల్చడం కానీ చేస్తుంటారు.
పూర్వీకుల ఆత్మశాంతి కోసమేనా?
ఈ ఆచారాన్ని ఏ నమ్మకం ఆధారంగా పాటిస్తున్నారు అనేది చాలా మందికి వచ్చే అనుమానం. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసమే ఈ సంప్రదాయాన్ని ఆ తెగ వారు అనుసరిస్తున్నారని తెలుస్తోంది. వేలు కత్తిరించడం మరణించిన వ్యక్తి నుంచి ఆత్మను దూరంగా ఉంచుతుందని వారు నమ్ముతారు. అసాధారణమైన ఈ వేలి కత్తిరింపు ఆచారాన్ని కొన్ని సంవత్సరాల కిందట ఇండోనేషియా ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ ఈ సంప్రదాయం ఇప్పటికీ రహస్యంగా కొనసాగుతుందని నమ్ముతారు. ఈ బాధాకరమైన ఆచారాన్ని అరికట్టే చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో కొంతవరకు ఈ ఆచారాన్ని పాటించే వారి సంఖ్య తగ్గుతోంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల దృష్ట్యా ఈ విషయంలో వ్యతిరేకత వస్తోంది.