Ideas of India Summit 2023:
సంజయ్ జునేజా కీలక ప్రసంగం..
రెండు రోజుల ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో భాగంగా తొలి రోజు పలువురు ప్రముఖులు విభిన్న అంశాలు ప్రస్తావించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ABP నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే...భవిష్యత్‌లో భారత్ ఎక్కడ ఉండాలో నిర్దేశించే విధంగా ఈ సదస్సు కొనసాగుతుందని స్పష్టం చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు మరి కొందరు సినీ, క్రీడా ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నయా ఇండియా" లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతోంది. ఈ క్రమంలోనే SBS Group of Companies వ్యవస్థాపకులు సంజీవ్ జునేజా కీలక ప్రసంగం చేశారు. "భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ" (Building Tomorrow's Economy)పై మాట్లాడారు. ఆయనతో పాటు Gallant Group of Industries ఛైర్మన్, ఎండీ చంద్ర ప్రకాశ్ అగర్వాల్, SENCO Gold and Diamonds ఎండీ, సీఈవో సువంకర్ సేన్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంజీవ్ జునేజా ఇన్వెస్టర్ కూడా. అంతే కాదు. ప్రముఖ ఆయుర్వేద కంపెనీ Divisa Herbal Careను స్థాపించారు. ప్రస్తుతం భారత్‌లో అభివృద్ధి చెందుతున్న FMCG కంపెనీల్లో ఇదీ ఒకటి. Kesh King బ్రాండ్‌తో సంజీవ్ జునేజా ఇండియా మార్కెట్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో తన సక్సెస్ స్టోరీ చెప్పారు సంజీవ్.
"2003లో నేను అంబాలాలో పని చేయడం మొదలు పెట్టాను. మా నాన్న ఓ డాక్టర్. ఆయుర్వేద మందులు తయారు చేయాలన్న ఆలోచన ఆయన నుంచే వచ్చింది. సొంతగా మేమే వాటిని విక్రయించడం మొదలు పెట్టాం. 2008 వరకూ కష్టాలు తప్పలేదు. ఆ తరవాత కొంత వరకు నిలదొక్కుకున్నాం. 2010 తరవాత మా ప్రొడక్ట్‌లు మార్కెట్‌లో ఫేమస్ అయ్యాయి. క్రమంగా మేమో బ్రాండ్ అయ్యాం. అందుకే నేను అందరికీ ఒకటే చెబుతాను. చివరి అడుగు నుంచి మనం ఏదీ మొదలు పెట్టలేం. ఆగిపోయిన ప్రతి సారీ మరో అడుగు ముందుకే వేయాలి"
-సంజీవ్ జునేజా, ఎస్‌బీఎస్ గ్రూప్ ఫౌండర్
తనంతట తానుగానే ప్రొడక్ట్‌లను మార్కెటింగ్ చేసుకున్నట్టు వివరించారు సంజీవ్ జునేజా. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని వివరించారు. హెయిర్ కేర్‌పై అప్పుడప్పుడే అందరిలోనూ అవగాహన పెరుగుతోందని గుర్తించినట్టు చెప్పారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నించినట్టు చెప్పారు. అందుకే హెయిర్ కేర్ కోసమే ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌లు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్టు తెలిపారు. ప్రొడక్ట్ ఎంత నాణ్యంగా ఉన్నా..మార్కెటింగ్‌తోనే ప్రజలకు చేరువవుతుందని వివరించారు.
"మీ ప్రొడక్టే మీ సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ముందు ఓ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఓ ప్రొడక్ట్ తీసుకురావాలి. అక్కడితో ఆగకుండా స్వయంగా మార్కెటింగ్ చేసుకోవాలి. నిలదొక్కుకోవాలంటే ఇదే కీలకం"
-సంజీవ్ జునేజా, ఎస్‌బీఎస్ గ్రూప్ ఫౌండర్