హైదరాబాద్‌ మహానగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతూనే ఉందో. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువవుతున్నాయి. నగరం మధ్యలో 55కిలోమీటర్ల పొడవున ప్రవహించే మూసీ నదిపై పాత వంతెనలే వినియోగంలో ఉన్నాయి. ఈ వంతెనలు ట్రాఫిక్ భారాన్ని మోయలేకపోతున్నాయి. ఈక్రమంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి మూసీ, ఈసీ నదులపై 14 వంతెనలు నిర్మించబోతోంది తెలంగాణ సర్కార్‌. మూసీపై 10, ఈసీపై నాలుగు... అంటే ఈ రెండు నదులపై మొత్తం 14 వంతెనలను నిర్మించబోతున్నారు. వీటిలో 14 వంతనెల్లో 13 హైలెవల్‌ వంతెనలు, ఒకటి పాదచారుల వంతెన. 14 వంతెనల్లో 5 బ్రిడ్జిలను HMDA నిర్మిస్తుండగా, మిగతా 9 బ్రిడ్జిలను జీహెచ్‌ఎంసీ  నిర్మిస్తోంది. 


హెచ్‌ఎండీఏ నిర్మించబోతున్న 5 బ్రిడ్జిలకు సంబంధించి టెండర్లను ఈమధ్యనే పిలిచారు. మంచిరేవుల, బుద్వేల్‌ ఐటీ పార్కు-1, బుద్వేల్‌ ఐటీ పార్కు-2,  పత్రాపసింగారం, ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ ప్రాంతాల్లో ఈ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్‌ చేశారు. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.


ఈసీ నదిపై బుద్వేల్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లోనే రెండు బ్రిడ్జిలను హెచ్‌ఎండీఏ నిర్మించనుంది. ఇక, గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌  వెళ్లే ఔటర్‌ రింగు రోడ్డు మార్గాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం ఐటీ కంపెనీలకు అనువుగా ఉండటంతో ఇక్కడ మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ  వీటిని నిర్మించనున్నారు. బుద్వేల్‌ ఐటీ పార్కుతో రాజేంద్రనగర్‌ రేడియల్‌ రోడ్డును అనుసంధానం చేసే విధంగా ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు.  అదేవిధంగా బండ్లజాగీర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఖలీజ్‌ఖాన్‌ దర్గా, కిస్మత్‌పూర్‌ ప్రాంతాలను కలుపుతూ పలు అనుసంధాన రోడ్లను సైతం నిర్మించనున్నారు. బుద్వేల్‌ ఐటీ  పార్కుకు సమీపంలోనే భవిష్యత్తులో ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ మార్గం ఏర్పాటు చేయనుండటంతో కొత్తగా పలు రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు.


ఈసీ నదిపై బుద్వేల్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లోనే రెండు బ్రిడ్జిలను హెచ్‌ఎండీఏ నిర్మించనుంది. బుద్వేల్ వద్ద హైలెవల్ బ్రిడ్జి, ఈసా నదికి సమాంతర రహదారి నిర్మించనున్నారు. బుద్వేల్‌ ఐటీ పార్కుతో రాజేంద్రనగర్‌ రేడియల్‌ రోడ్డును అనుసంధానం చేసేలా ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక, శంషాబాద్ ఎయిర్‌పోర్టు-మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ల మధ్య ఔటర్ రింగురోడ్డును ఆనుకొని బుద్వేల్ ఉండటంతో ఐటీ పార్కుకు అనుకూలంగా ఉంటుందని భావించారు. ఈ ప్రాంతంలో ఈసీ ప్రవహిస్తుండటంతో నదికి ఇరువైపులా ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ వంతెనలు ఐటీ కారిడార్ అభివృద్ధికి దోహదపడతాయని చెప్తున్నారు. ఇక, సన్సిటీ-చింతల్ మెట్ ప్రాంతాలను కలుపుతూ పవర్ కారిడార్ కింద హైలెవల్ బ్రిడ్జి నిర్మించబో్తున్నారు. రాజేంద్రనగర్ ఇన్నర్ రింగురోడ్డు నుంచి కిస్మత్పూర్ రోడ్డును, బండ్లగూడ జాగీర్ రోడ్డును కలుపుతూ బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో హై లెవల్ బ్రిడ్జిను నిర్మించబోతున్నారు. 


మంచిరేవుల ప్రాంతం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నార్సింగి వైపు మంచిరేవుల రావాలంటే ఔటర్‌ రింగు రోడ్డు, చేవెళ్ల రోడ్డు మీదుగా రావాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య గండిపేట చెరువు కింద నుంచి పారే మూసీ నదిపై ప్రస్తుతం లోలెవల్‌ బ్రిడ్జి ఉన్నా అది ఎంతో పురాతనమైంది. ట్రాఫిక్‌ను తట్టుకునే సామర్థ్యం కూడా లేదు. పైగా మూసీకి భారీగా వరద వస్తే ఈ బిడ్జ్రి నుంచి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉండదు. దీంతో మంచిరేవుల-నార్సింగి మధ్య హైలెవల్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే... ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లో నాగోల్‌ వైపు ఒక బ్రిడ్జి, ప్రతాపసింగారం వద్ద మరో బ్రిడ్జిని మూసీ నదిపై హెచ్‌ఎండీఏ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. టెండర్ల పరిశీలన పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు చేపడుతామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.