Nutty Putty Cave : ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటిలో కొండ గుహలు కూడా ఒకటి.  అనాది కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ఈ గుహలు మానవులకు, వివిధ జంతువులకు, వృక్ష జాతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఆదిమానవులు గుహలను నివాసాలుగా, ప్రకృతి విపత్తుల నుంచి సంరక్షణకు ఉపయోగించుకున్నారు. సాంస్కృతిక, మతపరమైన వైభవాలకు చరిత్రలో నిలిచిన గుహలు కేంద్రంగా ఉన్నాయి. ప్రస్తుతం వినోద కార్యకలాపాలకు, టూరిస్టు ప్రదేశాలుగా మారాయి. అయితే, గుహలు ఇరుకైన మార్గాలతో, సొరంగాలతో ప్రమాదకరమైనవిగాను, ప్రాణాంతక జంతువులకు నివాసంగాను నేటికీ ఉంటున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుహలను అన్వేషించే క్రమంలో ప్రమాదాలు జరిగి.. పలువరు పరిశోధకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.  అలాంటి ప్రమాదకరమైన గుహ గురించి తెలుసుకుందాం.


నట్టి పుట్టీ గుహ
నట్టి పుట్టీ గుహ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటా కౌంటీలోని ఉటా సరస్సుకు పశ్చిమాన ఒక హైడ్రోథర్మల్ గుహ ఉంది. ఈ గుహ గతంలో ఇరుకైన మార్గాలకు ప్రసిద్ధి చెందింది.  2009లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత ఇది మూతపడింది. అంతకు ముందు, ఇది బాయ్ స్కౌట్ దళాలు, కళాశాల విద్యార్థులలో నిత్యం కళకళలాడేది. 1960లో డేల్ గ్రీన్, అతని స్నేహితులు ఉటాలో ఒక గుహను కనుగొన్నారు. మృదువైన, గోధుమ రంగు పుట్టీ-ఆకృతితో కప్పబడిన దాని ఇరుకైన మలుపులు, మార్గాల గుండా వెళ్ళిన తర్వాత, వారు దానికి సిల్లీ పుట్టీ కేవ్ అని పేరు పెట్టారు. నట్టి పుట్టీ అంటే మంచి పేరు అని వారు తరువాత నిర్ణయించుకున్నారు.. తర్వాతర్వాత అదే పేరు ఉండిపోయింది.  ఆ సమయంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రసిద్ధ గుహగా మారుతుందని గ్రీన్‌కు తెలియదు. ఒక యువ అన్వేషకుడు గుహలో చనిపోతాడని లేదా విషాద సంఘటన తర్వాత అది మూసివేయబడుతుందని వారికి తెలియదు.  


నట్టి పుట్టీ కేవ్ ఒక భౌగోళిక అద్భుతం, ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ అంతటా, పొరుగు దేశాల నుంచి సాహసోపేతమైన పర్వాతారోహకులను ఆకర్షించింది. ఈ గుహను ఏడాదికి దాదాపు ఐదు వేలమంది సందరర్శించే వారు. వారిలో గుహ అన్వేషణ ప్రియులే ఎక్కువగా ఉండేవారు. కానీ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ నేడు వెలవెలబోయింది. గత ప్రమాదాలను గుర్తుచేస్తూ మూసివేశారు..  2009లో ఒక భయంకరమైన సంఘటన తర్వాత నట్టి పుట్టీ గుహ మూతపడింది. ఇది ఒక విషాదకరమైన సంఘటన. ఇది గుహ ఎదుర్కున్న భయంకరమైన సవాళ్లను నొక్కిచెప్పింది. మానవులు అలాంటి సహజ అద్భుతాలను చూసే విధానాన్ని కూడా మార్చేసింది.  2009వ సంవత్సరానికి చెందిన నట్టి పుట్టీ కేవ్ లేదా 26 ఏళ్ల జాన్ ఎడ్వర్డ్ జోన్స్ విషాధ కథ. ఇది ఒక హెచ్చరిక కథ. కష్టాలను ఎదుర్కొన్న రెస్క్యూ టీమ్‌ల  దృఢ సంకల్పం, అంకితభావానికి నిదర్శనంగా కూడా ఉపయోగపడుతుంది. 


మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను పోలిన కథ
ఈ కథ ఇటీవల కాలంలో  మలయాళంలో హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ కథాంశంతో సారూప్యతను కలిగి ఉంది. ఇది 2006లో కేరళలోని ఒక యువకుల బృందం ఒకటి గుహ లోపల చిక్కుకుపోయిన దాని చుట్టూ తిరుగుతుంది. తేడా ఏమిటంటే, మంజుమ్మెల్ బాయ్స్ తమ స్నేహితుడు సుభాష్‌ను సజీవంగా తిరిగి తీసుకురాగలిగారు.  ఉటా గుహలోని పగుళ్లలో 26 గంటలకు పైగా చిక్కుకున్న తర్వాత, రెస్క్యూ టీమ్  ఎంతో కష్టపడి అతన్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ జాన్ ఎడ్వర్డ్ జోన్స్ మరణించాడు. ఈ సంఘటన 2009 నవంబర్ నెలలో జరిగింది.






2009లో నట్టి పుట్టీ గుహలో ఏమి జరిగింది? 
నవంబర్ 24, 2009న జాన్ దాదాపు సాయంత్రం 6 గంటలకు 11మందితో కూడిన సమూహంతో నట్టి పుట్టీ గుహలోకి ప్రవేశించారు. వారిలో అతని సోదరుడు జోష్ కూడా ఉన్నాడు. రాత్రి 8.45 గంటల సమయంలో జాన్ గుహ లోపల "బాబ్స్ పుష్" అని పిలువబడే ప్రదేశంలో చిక్కుకుపోయాడు. గుహ లోపల ఇరుకైన ప్రాంతాలను కలిగి ఉంది. జాన్ 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తులో ఉన్న పగుళ్లలో తలక్రిందులుగా చిక్కుకున్నాడు. ఉపరితలం నుండి 150 అడుగుల దిగువన ఉన్న ఈ పగులు.. గుహ ద్వారం నుండి దాదాపు 700 అడుగుల దూరంలో ఉంది. జాన్ గుహలో హుక్ లాగా వేలాడబడి ఉన్నాడు.  రెస్క్యూ టీమ్‌ని మోహరించినప్పటికీ అతడిని తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని.  వారు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జాన్‌ను ఆ స్థానం నుండి బయటకు తీయలేకపోయారు.   24 గంటలకు పైగా అతనిని చేరుకోవడానికి రెస్క్యూ టీమ్ అన్ని రకాలుగా ప్రయత్నించింది. రెస్క్యూ టీమ్ నవంబర్ 25 అర్ధరాత్రి జాన్‌కి  దగ్గరగా వెళ్లగలిగింది. కానీ అప్పటికే అతడు ఊపిరి పీల్చుకోవడం లేదని కనుగొన్నారు. అతని శరీరంపై భరించలేనంత ఒత్తిడి కారణంగా అతడు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. 


 జాన్ శరీరానికి ఏమి జరిగింది?
గట్టి రాళ్లు, ఇరుకైన గోడల కారణంగా రెస్క్యూ టీం చాలా శ్రమించింది.  జాన్ నేరుగా పైకి క్రిందికి  దాదాపు 160-170 డిగ్రీల కోణంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనిషి ఊపిరి తీసుకోవడం కష్టమని నిపుణులు వెల్లడించారు. అట్లాంటా ఎమోరీ యూనివర్శిటీ హాస్పిటల్‌లో న్యూరాలజీ, న్యూరోసర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ వెండీ రైట్ అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఊపిరాడక చనిపోతారని పేర్కొన్నారు.  పక్కటెముక పై నుండి క్రిందికి ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు శరీర కుహరంలోకి విస్తరిస్తాయని డాక్టర్ రైట్ చెప్పారు. కానీ ఎవరైనా తలక్రిందులుగా ఉన్న స్థితిలో ఉంటే, ఊపిరితిత్తులు కాలేయం, పేగులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.  శ్వాస కండరాలు దానిని అధిగమించడానికి చాలా కష్టపడతాయని వైద్యులు తెలిపారు.  






జాన్ స్మారకంగా నట్టి పుట్టీ గుహ
జాన్ సజీవంగా లేడని నిర్ధారించిన తర్వాత, రెస్క్యూ అధికారులు నవంబర్ 26న సమావేశమై అతని మృతదేహాన్ని ఇరుకైన ప్రదేశం నుండి ఎలా వెలికి తీయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. జాన్‌కు భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాన్ మృతదేహాన్ని వెలికి తీయడం అంత సులభం కాదని నిర్ణయించుకుని, మృతదేహాన్ని లోపల వదిలిపెట్టి, గుహను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. జాన్ మృతదేహం ఉన్న గుహ  పైకప్పు పేలుడు పదార్థాలను ఉపయోగించి కూలిపోయేలా చేశారు. అనంతరం ఆ ప్రదేశానికి భవిష్యత్తులో ఎవరూ ప్రవేశించకుండా దాని ఎంట్రెన్స్ ను కాంక్రీటుతో మూసేశారు.  డిసెంబర్ 2009 నుండి మూసివేయబడిన ఈ గుహ ఇప్పుడు జాన్ మరణానికి స్మారక చిహ్నంగా ఉంది. . నట్టి పుట్టీ గుహ విషాదం ఆధారంగా 2016లో  'ది లాస్ట్ డిసెంట్' పేరుతో ఓ చిత్రం వచ్చింది.