New Parliament Highlights:
మే 28న ప్రారంభం..
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్ సిద్ధమైపోయిందని, ఆత్మనిర్భర్ భారత్‌కి ఇది ప్రతీకగా నిలిచిపోతుందని గతవారమే లోక్‌సభ ఓ ప్రకటన చేసింది. 2020 డిసెంబర్ 10వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. అయితే...కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 2021 జనవరిలో నిర్మాణం మొదలైంది. అహ్మదాబాద్‌కి చెందిన HCP Design Planning and Management ఈ బిల్డింగ్‌ని డిజైన్ చేసింది. ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ (Bimal Patel)దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ పక్కనే Tata Projects Limited ఈ నిర్మాణాన్ని చేపట్టింది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంట్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
1. సీటింగ్ కెపాసిటీ
పాత పార్లమెంట్‌లో లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది కూర్చునేందుకు వీలుండేది. అయితే..కొత్త పార్లమెంట్‌లో సీటింగ్ కెపాసిటీ పెంచారు. 888 మంది లోక్‌సభలో, 300 మంది రాజ్యసభలో కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
2. విస్తీర్ణంలోనూ భారీతనమే..
కొత్త పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పాత భవనం డయామీటర్ 560 అడుగులు. అది కేవలం 24,281 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. ఇప్పుడీ విస్తీర్ణాన్ని భారీగా పెంచారు.
3. సెంట్రల్ హాల్ లేదు
ప్రస్తుత పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ ఉంది. ఇందులోనే మీటింగ్‌లు జరిగేవి. అయితే...కొత్త పార్లమెంట్‌లో మాత్రం ఈ వసతి లేదు. లోక్‌సభ ఛాంబర్‌లోనే జాయింట్ సెషన్స్ ఏర్పాటు చేసుకునేలా మార్పులు చేర్పులు చేశారు.
4. హై ఎండ్ టెక్నాలజీ
పాత పార్లమెంట్‌లో ఫైర్ సేఫ్‌టీ (Fire Safety) లేదు. అసలు ఆ బిల్డింగ్‌ని ఫైర్ సేఫ్‌టీ నార్మ్స్ ప్రకారం నిర్మించలేదన్న వాదనలూ ఉన్నాయి. సెంట్రల్ విస్టా వెబ్‌సైట్‌లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అందులోనూ...ఆ బిల్డింగ్‌లో కొత్త ఎలక్ట్రిక్ కేబుల్స్ ఏర్పాటు చేయడం మరింత ప్రమాదకరంగా మారింది. ఇవి కాకుండా అదనంగా వాటర్ సప్లై లైన్స్, సీసీటీవీ, ఆడియో వీడియో సిస్టమ్ లాంటి హంగులు చేర్చడం వల్ల మొత్తం బిల్డింగ్ స్వరూపమే మారిపోయింది. కొత్త పార్లమెంట్‌లో ఇలాంటి సమస్యలేవీ రాకుండా జాగ్రత్తగా డిజైన్ చేశారు. కొత్త టెక్నాలజీతో రూపొందించారు. బయోమెట్రిక్స్ తీసుకొచ్చారు. ట్రాన్స్‌లేషన్ సిస్టమ్, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్ లాంటి హంగులూతోడయ్యాయి. లోపల ఇకో ఎక్కువగా రాకుండా సౌండింగ్‌కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ హాల్‌ని నిర్మించారు.
5. ఆర్కిటెక్చర్ మారిపోయింది..
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ నిర్మాణం...బ్రిటీష్ కాలం నాటిది. బ్రిటీష్ ఆర్కిటెక్ట్‌లు సర్ ఎడ్విన్ లుటెయిన్స్ ( Sir Edwin Lutyens),హర్బర్ట్ బేకర్ (Herbert Baker) దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ డిజైన్ చేశారు.
6. రూ.1,200 కోట్ల ఖర్చు
సనాతన పరంపర, వాస్తు శాస్త్రానికి సంబంధించిన పెయింటింగ్స్, డెకరేటివ్ ఆర్ట్స్, వాల్ ప్యానెల్స్, శిల్పాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ నిర్మాణానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో (Central Vista project) భాగంగా కొత్త సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, రాజ్‌పథ్‌లో మార్పులు చేర్పులు, ప్రధాని కొత్త ఇల్లు, ప్రధాని కొత్త కార్యాలయం..ఇలా అన్నింటినీ నిర్మించారు. పాత పార్లమెంట్ భవన నిర్మాణాన్ని 1921లో మొదలు పెట్టి 1927లో పూర్తి చేశారు. అప్పట్లో దీని కోసం రూ.83 లక్షలు ఖర్చు పెట్టారు.
Also Read: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర- తెలుగు కుర్రాడు సాయి వర్షిత్ అరెస్టు