చిరుతలు వస్తున్నాయ్..
చిరుత పులుల సంఖ్య పెంచటం ఎలా..? ఇప్పుడీ ఆలోచనలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చిరుతలు అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరిపోయాయి. ఏవో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. ఇంకొన్ని సంవత్సరాలు గడిస్తే పూర్తిగా ఇవి కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇది ముందుగానే ఊహించిన కేంద్రం చిరుతల సంఖ్య పెంచే పనిలో పడింది. ఇందుకోసం దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో పల్పూర్ నేషనల్ పార్క్‌కు చిరుతలను తరలించనున్నట్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ ఏడాది ఆగస్టులోగా ఈ పని పూర్తి చేయనున్నట్టు తెలిపింది. ఈ నేషనల్ పార్క్‌లో కేవలం చిరుతల కోసమే 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఇందులో కనీసం 6 చిరుత పులుల్ని ఉంచనున్నారు. ఇప్పటి నుంచి ఏటా కనీసం 8-10 చిరుతల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
సురక్షిత ప్రాంతాల్లోనే చిరుతల్ని వదలాలి: సుప్రీం కోర్టు
భారత్‌లో చిరుతలు అంతరించిపోయే దశలో ఉన్నాయని 1952లోనే ప్రభుత్వం ప్రకటించింది. చిరుతల్ని వేటాడటం అప్పట్లో హోదాగా భావించేవారు. చిరుతల్ని చంపిన వాళ్లకు కానుకలు అందించటం 1871 నుంచే మొదలైంది. వేటను ప్రోత్సహించిన బ్రిటీష్ రాజ్ చట్టం వల్లే భారత్‌లో చిరుతల సంఖ్య భారీగా తగ్గిపోయిందనేది చరిత్రకారుల వాదన. ఈ వేట దశాబ్దాల పాటు కొనసాగటం వల్ల క్రమక్రమంగా చిరుతలు కనిపించటం తగ్గిపోయింది. 20శతాబ్దం నాటికి ఈ సమస్య తీవ్రతరమైంది. 1920ల్లో చిరుతలను వేటాడాలని చూసినా అవి కనిపించలేదంటే అప్పటికే వాటి సంఖ్య తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కార మార్గాలు అన్వేషిస్తోంది కేంద్రం. ఇందులో భాగమే దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను తెచ్చుకోవటం. నిజానికి ఇలా ఆఫ్రికా నుంచి భారత్‌కు చిరుతల్ని రప్పించటం ఇదే మొదటిసారి కాదు. 1918-39 మధ్య కాలంలోనే భవనగర్, కొల్హాపూర్ రాజులు చిరుతల్ని దిగుమతి చేసుకునే వారట. అప్పటి నుంచి చిరుతలు ఇలా భారత్‌కు దిగుమతి అవుతూ వస్తున్నాయి. వీటిలో కొన్నింటిని జూలలో ఉంచుతున్నారు. 1949-89 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 7 జూలలో 25 చిరుతల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చిరుతల్ని ఇలా దిగుమతి చేసుకుని అడవుల్లోకి వదలటం వల్ల వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతరించిపోతున్న జాతిని సంరక్షించుకునేందుకు ఇలాంటి ప్రత్యామ్నాయాలు అనుసరించటం ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. అయితే ఇలా చిరుతల్ని తీసుకొచ్చి వదిలే ప్రాంతాలు సురక్షితంగా ఉండాలని 2020లో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.