TTD US Srivari Kalayanutsavam :  అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగు వారి కోసం శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్ణయించాయి.  జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( YV Subba Reddy ) వెల్లడించారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడింది . అందుకే   భక్తుల కోరిక మేరక..   సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ ప్రకటించింది. 


ప్రవాస భారతీయ సంఘాల సహకారంతో  టీటీడీ శ్రీనివాస కల్యాణోత్సవాలు 


టీటీడీ ( TTD ) నిర్వహించబోతున్న శ్రీనివాస కల్యాణాలకు అమెరికాలోని ప్రవాస భారతీయులు సహకరించనున్నారు. అక్కడి పలు సంఘాలు ఈ మేరకు టీటీడీకి హామీ ఇచ్చాయి.   ఆంధ్రప్రదేశ్ ప్రవాస భారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అనుమతులు, ఏర్పాట్లు, కల్యాణోత్సవాల నిర్వహణలో వారు సహకరిస్తున్నారు. అక్కడి సంఘాలతో మాట్లాడిన తర్వతా తేదీలు కూడా ఖరారు చేశారు. 


జూన్ 18 నుంచి ప్రారంభం జూలై 9 వరకూ పలు నగరాల్లో కల్యాణోత్సవాలు


జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.  అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు ( Sri Vari Kalyanam ) జరుగుతాయన్నారు.. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి చెబతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 


కరోనా తర్వాత ఇప్పుడు బయట దేశాల్లో నిర్వహణ 


టీటీడీ నుంచి పండితులు, అర్చకులు వెళ్లి ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించడం చాలా కాలంగా జరుగుతోంది. అయితే కరోనా కారణంగా కొంత కాలంగా ఇవి జరగలేదు. ప్రవాస భారతీయుల సహకారంతో వీటిని మళ్లీ ప్రారంభించనున్నారు.