Supreme Court on Bulldozer Justice: బుల్‌డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు అయినంత మాత్రాన ఇల్లు కూల్చివేయాలా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. బుల్‌డోజర్ న్యాయాన్ని నిలదీస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ దుశ్యంత్ దావే వాదించారు. దేశవ్యాప్తంగా ఈ బుల్‌డోజర్ న్యాయాన్ని అమలు చేయాలని చూస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ న్యాయాన్ని తప్పుబట్టింది. నేరం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఆస్తుల్ని ధ్వంసం చేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ ఇంటి నిర్మాణం అక్రమం అని తేలినప్పుడే ధ్వంసం చేయాలని స్పష్టం చేసింది. దీనిపై కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు అని తేలినప్పుడు ముందు నోటీసులు ఇవ్వాలని, వాళ్లు స్పందించని పరిస్థితుల్లో చట్టానికి లోబడి ధ్వంసం చేయాలని తేల్చి చెప్పింది.
"ఇళ్లు కూల్చివేయాలంటే అంత కన్నా ముందు కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. కేవలం ఓ నేరం చేసినంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా. ఒకవేళ అది అక్రమ నిర్మాణం అని తేలితే పరవాలేదు. కానీ కేవలం నిందితుడు అన్న కారణానికి ఇల్లు కూల్చివేస్తామనడం మాత్రం సరికాదు. ఈ విషయంలో కచ్చితంగా ఓ విధానాన్ని అనుసరించాలి. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తేనే కూల్చివేస్తున్నామని మీరు చెబుతున్నారు. అయితే...అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తప్పకుండా ఉండాలి"
- సుప్రీంకోర్టు ధర్మాసనం
పిటిషనర్ల తరపున అడ్వకేట్ దుశ్యంత్ దావే, సీయూ సింగ్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చేపట్టిన కూల్చివేతల గురించి ప్రస్తావించారు. 50,60 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లనూ కూల్చివేస్తున్నారని చెప్పారు. కొన్ని కేసులనూ ఈ సందర్భంగా ఉటంకించారు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ఘటన జరిగింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంటనే అధికారులు ఆ నిందితుడి ఇల్లు కూల్చి వేశారు. దీనిపైనే అడ్వకేట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "కొడుకు తప్పు చేస్తే తండ్రి కట్టుకున్న ఇల్లుని కూల్చివేయడమేంటి" అని ప్రశ్నించారు. ఇది సరికాదని స్పష్టం చేశారు. నేరస్థులు అని నిర్ధరణ అయినప్పటికీ ఇళ్లు కూల్చివేసే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ బుల్‌డోజర్ జస్టిస్‌పై ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇదేం న్యాయం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్దతునిచ్చే వాళ్లు ఉన్నప్పటికీ అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది.
Also Read: Google Chrome: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త - కేంద్రం హెచ్చరికలు