Chandrayaan-4 Mission: చంద్రయాన్ 4 ప్రయోగంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఇన్సాట్ 3DS శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. GSLV-F14 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగానే ఇస్రో చేపట్టబోయే మిగతా ప్రయోగాల గురించి ప్రస్తావించారు సోమనాథ్. చంద్రయాన్ 4 తో పాటు 5,6,7 ఇలా వరుస పెట్టి ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. చంద్రయాన్ 3 సక్సెస్ అవడం వల్ల అందరిలోనూ ఉత్సాహం పెరిగిందని, మిగతా మిషన్స్‌పైనా అధ్యయనం చేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని ఏ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా చేపట్టాలో కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
"చంద్రయాన్ 4 ప్రయోగంపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నాం. ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపాలో మేధోమథనం చేస్తున్నాం. పేలోడ్‌గా ఏం ఉండాలన్నదే అసలు ప్రశ్న. దీనిపైనే కసరత్తు జరుగుతోంది. చంద్రయాన్ 4 ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని సేకరించి సురక్షితంగా కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రోబో ద్వారా ఇదంతా పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఇది ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న రాకెట్‌లు అందుకు సహకరించే పరిస్థితి లేదు. అందుకే కొత్తగా వేరే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా దీని గురించి అన్ని వివరాలూ బయట పెట్టలేను. కొన్ని రహస్యంగానే ఉంచేస్తాం"
- ఎస్ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
చంద్రయాన్-3 సక్సెస్‌తో (Chandrayaan-3 Mission) ఇస్రో పేరు అంతర్జాతీయంగా మారు మోగింది. అత్యంత కష్టమైన సౌత్‌పోల్‌పై ల్యాండర్‌ని చాలా సేఫ్‌గా ల్యాండ్ చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో మరో రెండు లూనార్ మిషన్స్ (ISRO Lunar Missions)చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఇస్రో రెండు కీలక లూనార్ మిషన్స్‌ని చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పుడే వీటికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి LuPEx, మరోటి చంద్రయాన్-4 (Chandrayaan-4).ఈ మిషన్ ద్వారా 350 కిలోల బరువున్న ల్యాండర్‌లను చంద్రుడిపై చీకటి ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇన్‌శాట్ ప్రయోగం విజయవంతం..
ఇస్రో INSAT 3DS శాటిలైట్‌ని (ISRO Future Missions) విజయవంతంగా ప్రయోగించింది. GSLV-F14 రాకెట్ ద్వారా 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్-3డీఎస్‌ను నింగిలోకి పంపింది. విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితల వాతావరణాలపై ఈ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఈ పరిశోధనల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇస్రోకి అందించనుంది. ఈ శాటిలైట్ పదేళ్ల పాటు ఇస్రోకి సేవలు అందిస్తుంది. దశలవారీగా విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. పేలోడ్ విడిపోయిందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయంవంతం అవడంపై ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. అనుకున్న విధంగానే కక్ష్యలోకి దూసుకెళ్లినట్టు ప్రకటించారు.
Also Read: బలవంతంగా మతం మారిస్తే పదేళ్ల జైలుశిక్ష, ఛత్తీస్‌గఢ్‌లో కొత్త బిల్లు!