Lokesh Kanagaraj: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ గతేడాది మిక్స్‌డ్ టాక్‌తో కూడా భారీ విజయం అందుకుంది. ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ‘లియో’ క్లైమ్యాక్స్‌లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ కూడా ‘లియో 2’ ఉంటుందన్న విషయాన్ని గట్టిగానే చెప్పారు.


పొలిటికల్ ఎంట్రీతో...
కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ప్రస్తుతం చేస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కాకుండా అప్పటికి కమిట్ అయిన మరొక్క సినిమా చేసి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇస్తానని విజయ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘లియో 2’ ఉండదని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.


ఇటీవల ఒక కామిక్ బుక్ ఈవెంట్లో పాల్గొన్న లోకేష్ కనగరాజ్‌కు కూడా మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. ‘లియో 2’ ఉంటుందా? ఉండదా? అని లోకేష్‌ను ప్రశ్నించారు. దీనికి లోకేష్ ‘విజయ్ లక్ష్యం వేరేగా ఉంది. లియో 2 పూర్తిగా సాధ్యమే. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సినిమా చేస్తాను.’ అని సమాధానం ఇచ్చారు.


ఇదే కార్యక్రమంలో ఆయన రజనీకాంత్‌తో చేస్తున్న ‘తలైవర్171’ సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమాకు సంబంధించిన రైటింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతుందని, రెండు మూడు నెలల్లో షూటింగ్‌కు వెళ్తామని తెలిపారు.


గతంలోనే ‘తలైవర్171’  సినిమాకు సంబంధించి దర్శకుడు లోకేష్ కీలక విషయాలను వెల్లడించారు. అసలు ఈ కథను రజనీకాంత్ కు ఎలా చెప్పారు? చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయాల గురించి వివరించారు. ఈ సినిమా గురించి తెలిసిన వెంటనే కమల్ హాసన్ తనకు ఫోన్ చేసిన అభినందించినట్లు వెల్లడించారు. “ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2024 ఏప్రిల్ కల్లా ఈ పనులు కంప్లీట్ అవుతాయి. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కథ విని రజనీకాంత్ చాలా సంతోషించారు. అనిరుధ్ తో కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించా. స్టోరీ విని ఆయన నన్ను కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. సూపర్ స్టార్ ఓకే చెప్పడంతో నాకు చాలా సంతోషం కలిగింది” అని లోకేష్ కనగరాజ్ వెల్లడించారు.


ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం షారుఖ్ ఖాన్ ను సంప్రదించారట. తాను ఇప్పటికే చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇకపై తన సొంత సినిమాల మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారట. దీంతో మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం అడిగారట. రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.