Hindu Temple Attack: 



కొలంబియా ప్రావిన్స్‌లో దాడి 


కెనడాలో మరోసారి హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుముఖం పట్టినా...మళ్లీ అలజడి మొదలైంది. కొలంబియా ప్రావిన్స్‌లోని ఆలయాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఆగస్టు 12న రాత్రి పూట ఖలిస్థానీలు ధ్వంసం చేశారు. ఆ తరవాత ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కి మద్దతుగా పోస్టర్లు అంటించారు. ఆలయ ప్రధాన ద్వారానికీ పోస్టర్లు అంటించారు. సీసీ కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇటీవల హత్యకు గురైన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ పోస్టర్‌లు ఆలయం నిండా అంటించారు. కొలంబియాలోనే హత్యకు గురయ్యారు హర్‌దీప్. ఈ హత్యలో భారత్ హస్తం ఉందని ఖలిస్థానీలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కానీ..భారత్ సహా కెనడా ఈ ఆరోపణల్ని ఖండించాయి. జూన్ 18న ఇద్దరు దుండగులు గురుద్వారా ప్రాంగణంలోనే హర్‌దీప్ సింగ్‌ని హత్య చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు హర్‌దీప్. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (Khalistan Tiger Force)నీ లీడ్ చేస్తున్నారు. కెనడాలో యాంటీ ఇండియా ఉద్యమ నాయకుడిగానూ ఎదిగారు. కెనడా సెక్యూరిటీ ఏజెన్సీలు అప్పటికే హెచ్చరించాయి. ప్రాణహాని ఉందని ముందుగానే అలెర్ట్ చేశాయి. కానీ...వాటిని లెక్క చేయలేదు హర్‌దీప్ సింగ్. ఆయన లొకేషన్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసిన దుండగులు గురుద్వారాలోనే హత్య చేశారు. దీనికి నిరసనగానే...ఆలయాలపై దాడులు మొదలు పెట్టారు ఖలిస్థాన్ మద్దతుదారులు. 


వరుస దాడులు


కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఏప్రిల్‌లోనూ ఒంటారియోలోని ఓ హిందూ ఆలయ గోడలపై గ్రాఫిటీతో అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారు దుండగులు. ఇప్పటికే దీనిపై విచారణ చేపడుతున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆ గోడలపై గ్రాఫిటీతో అభ్యంతరకర రాతలు రాసినట్టు వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా..? దీని వెనక ఎవరున్నారు..? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై హిందువులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ఇద్దరు వ్యక్తులు అదే ప్రాంతంలో తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఈ నేరం తానే చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరిలోనూ మిస్సిసౌగా ప్రాంతంలోని రామ మందిరంపై ఇలాంటి దాడే జరిగింది. కెనడా ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. గతేడాది సెప్టెంబర్‌లోనూ కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ వద్ద ఉన్న శిలాఫలకంపై గుర్తు తెలియన వ్యక్తులు "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాలు రాశారు. అటు పక్కనే హిందుస్థాన్‌ను అనుమానించే విధంగా స్లోగన్స్‌ రాశారు.


స్థానికంగా ఇది పెద్ద అలజడికి కారణమైంది. రాత్రికి రాత్రే వీటిపై ఎవరు రాశారన్న అంశంపై సరైన విచారణ జరపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. టోర్నటోలో ఉన్న ఈ ఆలయం అక్కడ ఎంతో ప్రసిద్ధి. దీనిపై ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) తీవ్రంగా స్పందించింది. ఆలయ ప్రతిష్ఠకు ఇలా మచ్చ తెచ్చిన వారెవరో కనుక్కో వాలని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులకు సూచించింది. దీనిపై పలువురు రాజకీయ నేతలూ స్పందించారు.


Also Read: India-China Standoff: భారత్ చైనా మధ్య 19వ రౌండ్ చర్చలు, కమాండర్ స్థాయిలో భేటీ