హిజాబ్‌ను ధరించి విద్యాసంస్థలకు వెళ్లేలా అనుమతివ్వాలని దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు 2 గంటలకుపైగా విచారించింది. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
మధ్యంతర తీర్పు
అయితే అంతకుముందు ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంధ్యతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.
అంతకుముందు జస్టిస్ క్రృష్ణ దీక్షిత్ ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. విస్తృత ధర్మాసనమే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు.