1992లో ఓ రిజర్వాయర్ కట్టాలనుకున్నారు. పక్కనే ఉన్న గ్రామం అడ్డు వచ్చింది. గ్రామస్థులందరికీ వేరే చోట పునరావాసం కల్పించి రిజర్వాయర్ కట్టేశారు. డ్యామ్ నుంచి పారుతున్న నీళ్లలో ఆ గ్రామం మునిగిపోయింది. అలా ముప్పై ఏళ్ల క్రితం నీటి అడుగుకు చేరిపోయింది. ఇప్పుడు కరువు ఏర్పడి ఆ గ్రామం బయటపడింది. ఆ గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఊరిని వదిలి వెళ్లిన వాళ్లు ఇప్పుడు పెద్దవాళ్లయిపోయారు. తాము పుట్టిన ఊరును చూసేందుకు వారంతా వచ్చి వెళుతున్నారు. ఇదంతా జరిగింది స్పెయిన్లో. నీళ్లలో కలిసిపోయి బయటపడిన ఆ గ్రామం పేరు అసెరేడో.
ఈ రిజర్వాయర్ ఉన్నది స్పానిష్ - పోర్చుగీస్ సరిహద్దు ప్రాంతంలో. ఆ ఆనకట్ట దాదాపు ఎండిపోయి శిథిలాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో కొన్ని నెలల నుంచి వర్షాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తతుం రిజర్వాయర్లో కేవలం 15 శాతం నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని సందర్శించిన పర్యాటకులు దాన్ని ‘ఘోస్ట్ టౌన్’గా పిలుస్తున్నారు. అందులో ఒక కేఫ్‌లో పేర్చిన ఖాళీ బీరుబాటిళ్లను కనుగొన్నారు. అవి ముప్పై ఏళ్లుగా పేర్చినవి పేర్చినట్టే ఉన్నాయి. ధ్వంసమైన కారు, రాతి గోడలు, తుప్పు పట్టిన ఇనుప ఊచలు ఉన్నాయి. ‘ముప్పై ఏళ్ల క్రితం ఈ ప్రదేశం అంతా ద్రాక్షతోటలు, నారింజ తోటలతో నిండి ఉండేది. అంతా పచ్చగా కళకళలాడేది’ అని 1992కి ముందు అక్కడ జీవించిన 72 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ఆయన అప్పట్లో రోజూ ఆ కేఫ్ కి వచ్చి వెళ్లేవారు.
Also Read: ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం, అంతకన్నా తగ్గితే ఏమవుతుంది?
Also Read: క్యారెట్ హల్వాలాగే ఆపిల్ హల్వా, రుచి అదిరిపోతుంది