Heeraben Demise:


ఆమెపై భగవంతుని కృప ఉంది - మోడీ


తల్లి హీరాబెన్‌ మోడీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే..తన తల్లి ప్రస్తావన తీసుకు వచ్చే వారు. ఎంత కష్టపడి పోషించిందో వివరించేవారు. అలా 2019లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి గురించి ఎంతో ఆసక్తికర విషయం చెప్పారు మోడీ. Humans of Mumbai కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "మా ఇంటి ముందు ఉదయం 5 గంటలకే చుట్టు పక్కల వాళ్లంతా వచ్చి నిలబడే వారు. అప్పుడే పుట్టిన శిశువులతో పాటు చిన్న పిల్లలకు మా అమ్మ తనకు వచ్చిన విద్యతో వాళ్లకు ధైర్యం ఇచ్చేది. ఏదైనా సమస్య వస్తే చాలు వాళ్లకు అండగా ఉండేది. ఇంటి ముందు చాలా మంది తల్లులు తమ పిల్లలతో నిలబడే వారు. మా అమ్మ చేతి స్పర్శ తాకితే చాలు అంతా నయమైపోతుందని వాళ్లు నమ్మేవాళ్లు. హీలింగ్ టచ్ అని పిలుచుకునే వాళ్లు. అమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ ఆ భగవంతుడి కటాక్షం ఆమెపై ఎప్పుడూ ఉంది" అని చెప్పారు ప్రధాని మోడీ. హీరాబెన్ మోడీ తన వంట తానే స్వయంగా చేసుకునే వారు. పప్పు, అన్నం, కిచ్‌డీ తినేందుకే ఎక్కువగా ఇష్టపడేవారు. బ్రెడ్, కూరగాయలు, సలాడ్‌ అంటే ఇష్టంగా 
తినేవారు.    


మరో ఇంటర్వ్యూలో..


2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్‌తో మాట్లాడిన సందర్భంలో తన తల్లి గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. "ఆమె ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుంది. తనకు చదువు రాదు. కానీ వార్తలు రోజూ  చూస్తుంది. ఏం జరుగుతోందో తెలుసుకుంటుంది. మా చిన్నతనంలో మమ్మల్ని పోషించేందుకు పొరుగింట్లో అంట్లు తోమేది. కాయకష్టం చేసేది. ఓ తల్లి తన పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో అవన్నీ చేసింది. తన పిల్లల కలలు నెరవేర్చేందుకు జీవితాల్నే త్యాగం చేసిన అమ్మలెందరో ఉన్నారు" అంటూ ఎమోషనల్ అయ్యారు మోడీ. ఇటీవలే తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన బ్లాగ్‌లో ఓ వ్యాసం కూడా రాశారు. "మా అమ్మ 100వ సంవత్సరంలోకి 
అడుగు పెడుతుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మా నాన్న బతికి ఉండుంటే ఆయన కూడా ఇలా 100వ పుట్టిన రోజు జరుపుకునే వారు. ఈ మధ్యే నా మేనల్లుడు కొన్ని వీడియోలు పంపించాడు. మా నాన్న ఫోటోని కుర్చీలో పెట్టింది మా అమ్మ. కొందరు పిల్లలు అక్కడికి వచ్చారు. అమ్మ మంజీర పట్టుకుని భజనలు పాడుతోంది. నా చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. శారీరకంగా నీరసపడిపోయినా మానసికంగా మాత్రం ఎప్పుడూ హుషారుగానే ఉంటుంది. చిన్నతనంలోనే మా అమ్మ తన తల్లిని పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే బతికింది. తన తల్లి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయే అదృష్టం ఆమెకు లేకుండా పోయింది. బడికి వెళ్లే అవకాశమూ లేదు. తన చిన్నతనమంతా పేదరికంలోనే గడిచిపోయింది" అని బ్లాగ్‌లో రాశారు ప్రధాని మోడీ. 


Also Read: Bharat Jodi Yatra UP: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఇన్విటేషన్, భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గొంటారా?