మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొంకణ్ ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోవైపు కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
రాయ్‌గఢ్ జిల్లాలోని తలై గ్రామంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 30 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపైకి భారీగా వరదనీరు రావడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు రాయ్‌గఢ్ కలెక్టర్ తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబయి-గోవా, ముంబయి-నాసిక్ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ మార్గాల్లో వేలాది వాహనాలు బారులు తీరాయి.
సాయంత్రం సమయంలో అందరూ ఇళ్లల్లో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది వాటి కింద చిక్కుకుపోయారు. ఇప్పటికే పలువురు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే మట్టి పెళ్లల కింద ఖచ్చితంగా ఎంత మంది చిక్కకున్నారన్న వివరాలు తెలియడం లేదు. దాదాపు 75 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో నాలుగు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొల్హాపూర్ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మహారాష్ట్రలో రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఓ వైపు వరదలు, మరోవైపు విరిగిపడుతున్న కొండ చరియలతో జనం వణికిపోతున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేవీ, ఆర్మీ సాయం కోరింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్ దళాలు మోహరించాయి. హెలికాప్టర్లు, పడవల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో వర్షాల పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యల్లో కేంద్రం తరపున అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
భారీ వర్షాల కారణంగా రత్నగిరి జిల్లాలో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. తీర గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. కనీసం 27 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఠాణె, పాల్ఘర్, సింధుదుర్గ్, కొల్హాపూర్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో అక్కడి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల సంబంధిత ఘటనల్లో పాల్ఘర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వాణిజ్య రాజధాని ముంబయిలోని గోవండి ప్రాంతంలో వర్షాల కారణంగా ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.