సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని... తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో పార్టీని వీడుతున్నట్టు రాజీనామా లేఖలో స్పష్టం చేశారు మోత్కుపల్లి.  నిస్వార్థంగా సేవ చేసేందుకు బీజేపీలో చేరానని.. అది జరిగే పరిస్థితి లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు మోత్కుపల్లి. సుదీర్ఘం అనుభవం ఉన్న తన సేవలు వినియోగించుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఘాటుగా విమర్శించారు. కనీసం కేంద్ర కమిటీలో కూడా స్థానం కల్పించలేకపోయారని ఆరోపించారు.


ఈటల రాజేందర్ చేరికపై కూడా మోత్కుపల్లి సీరియస్ కామెంట్స్ చేశారు. దళితుల భూములు ఆక్రమించుకున్న వ్యక్తిని బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఎస్సీల భూములు ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వ్యక్తి నుంచి కనీసం వివరణ లేకుండా నేరుగా పార్టీలోకి తీసుకోవడంపై నర్సింహులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేందర్‌ను పార్టీలోకి తీసుకునే టైంలో ఓ సీనియర్ నేతగా తనకు మాటమాత్రమైనా చెప్పలేదన్నారు మోత్కుపల్లి. 


ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి ఆహ్వానించారని... తాను వెళ్లిన ఎపిసోడ్‌పై చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి. చెప్పి వెళ్లినప్పటికీ పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని... ఇది చాలా బాధించిన అంశంగా పేర్కొన్నారు మోత్కుపల్లి. 


రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి నర్సింహులు... తెలంగాణ సీఎంఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ద‌ళితుల సంక్షేమం కోసం ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. ద‌ళితుల గుండెల్లో అంబేద్క‌ర్ వార‌సుడిగా కేసీఆర్ మిగిలిపోతారని అభిప్రాయపడ్డారు. ద‌ళితులంద‌రూ సీఎం కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్ర‌తి ఊరు, ప్ర‌తి వాడ‌లో ద‌ళిత బంధు ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దండోరా వేయాలన్నారు. ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి దరువు వేశారు.


హుజురాబాద్ ఉపఎన్నికల ముందు బీజేపీకి మోత్కుపల్లి ఎపిసోడ్‌ ఇబ్బందికర అంశంగానే చెప్పొచ్చు. హుజురాబాద్‌లో దళిత ఓటర్లు చాలా మంది ఉన్నారు. అందుకే  ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని... ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసిన కేసీఆర్‌... విపక్షాల నోళ్లు మూయించారు. అంటే అక్కడ దళితుల ఓట్లు ఎంత ఇంపార్టెంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మోత్కుపల్లి నర్సింహులు లాంటి దళిత నేత పార్టీని వీడటం ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు.   


ALSO READ: ఏపీ అప్పులపై పయ్యావుల అడిగిన ప్రశ్నలేంటి? బుగ్గన సమాధానలేంటి?