Heat Waves in India:


పెరిగిన హీట్  


దేశవ్యాప్తంగా వారం రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పెరుగుతున్నాయి. వేడి గాలుల తీవ్రత కూడా పెరుగుతోంది. కొద్ది రోజుల పాటు ఈ వేడిగాలుల ముప్పు తప్పదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. దీన్నే టెక్నికల్ పరిభాషలో Blackouts అంటారు. సాధారణంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే...విపరీతమైన వేడి కారణంగా ట్రాన్స్‌మిష్‌ లైన్స్‌ సరైన విధంగా పవర్‌ను సప్లై చేయలేవు. ఈ కారణంగానే పదేపదే కరెంట్ పోవడం, సప్లైలో అంతరాయం ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడిగాలుల ప్రభావానికి గురయ్యే ప్రమాదముంది. వడ దెబ్బల కారణంగా ప్రాణాలూ కోల్పోయే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల 18న ఒడిషాలోని బరిపడ ప్రాంతంలో 44 డిగ్రీలు దాటింది ఉష్ణోగ్రత. ఇదే రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు రాష్ట్రాలకు హీట్‌ వేవ్‌ వార్నింగ్‌ ఇచ్చింది భారత వాతావరణ విభాగం (IMD).హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా ఈ జాబితాలో ఉన్నాయి. సాధారణంగా వేసవిలో ఉండే ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తే...ఈ సారి భారత్‌లో ఎక్కువ డిగ్రీలు నమోదవుతున్నాయి. గతేడాది కూడా చాలా రోజుల పాటు వేడి గాలులు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. ఈ ప్రభావంతో గోధుమల దిగుబడి బాగా తగ్గిపోయింది. 


విద్యుత్ సమస్యలు 


వేడిని తట్టుకోలేక చాలా మంది ఎయిర్ కూలర్లు, ఏసీలు విపరీతంగా వినియోగిస్తున్నారు. వీటి కారణంగా పవర్ ఫెయిల్యూర్‌ సమస్యలు తలెత్తే అవకాశముంది. వేడితో పాటు ఉక్కపోత కూడా ఉంటే అది ఇంకా ప్రమాదకరం అంటున్నారు వాతావరణ నిపుణులు. దేశంలో చాలా మంది పని చేసుకునేందుకు బయటకు వస్తుంటారు. నిర్మాణ కార్మికులు, రిక్షాలు తొక్కే వాళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు..ఇలా ఎంతో మంది బయటే పని చేసుకుంటారు. వేడి గాలుల ప్రభావం వీరిపైనే ఎక్కువగా ఉంటోంది. ప్రపంచంలో ఉష్ణోగ్రతల కారణంగా ఎక్కువ మంది కార్మికులను కోల్పోతున్న దేశం భారత్‌. ముంబయిలో ఒక్క రోజే వడ దెబ్బ తాకి 13 మంది మృతి చెందారు. బాడీ డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలని నిపుణులు ప్రజలకు సూచించారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా క్యాప్‌లు పెట్టుకోవాలని చెబుతున్నారు. కాటన్ దుస్తులు ధరించడం వల్ల వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వారం రోజుల పాటు విద్యాసంస్థలు మూసేశారు. మరి కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీల టైమింగ్స్ మార్చేశారు. వేడిగాలుల ముప్పు నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. 


Also Read: Meta Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్‌లు, వచ్చే నెలలో మరో రౌండ్ కూడా ఉంటుందట!