Mankind Pharma IPO: మ్యాన్‌కైండ్ ఫార్మా, రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ధరను ఖరారు చేసింది. ఒక్కో షేరుకు రూ. 1,026 నుంచి రూ. 1,080 మధ్య ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా నిర్ణయించింది. 


IPO తేదీలు
ఈ నెల 25న (మంగళవారం) సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమయ్యే పబ్లిక్ ఇష్యూ 27వ తేదీ (గురువారం) వరకు కొనసాగుతుంది.


దిల్లీకి చెందిన ఈ ఔషధ కంపెనీలోని వాటాలను పాక్షికంగా అమ్మాలని ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదార్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లోనే వస్తోంది. అంటే, IPO ద్వారా వచ్చే డబ్బు ఒక్క రూపాయి కూడా కంపెనీ ఖాతాలోకి వెళ్లదు. ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదార్ల ఖాతాల్లోకి ఆ డబ్బు వెళుతుంది.


కంపెనీ దాఖలు చేసిన రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం, IPO ద్వారా నాలుగు కోట్లకు పైగా (4,00,58,844) షేర్లను మార్కెట్‌లో అమ్మకానికి పెడుతున్నారు.


ప్రమోటర్లు రమేష్ జునేజా 3,705,443, రాజీవ్ జునేజా 3,505,149, శీతల్ అరోరా 2,804,119 ఈక్విటీ షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తారు. OFS తర్వాత కంపెనీలో ప్రమోటర్ వాటా 79 శాతం నుంచి 76.50 శాతానికి తగ్గుతుంది. 


ప్రమోటర్లు కాకుండా, కెయిర్న్‌హిల్ CIPEF లిమిటెడ్ (17,405,559 ఈక్విటీ షేర్లు), కెయిర్న్‌హిల్ CGPE లిమిటెడ్ (2,623,863 వరకు ఈక్విటీ షేర్లు), బీజ్ లిమిటెడ్ (9,964,711 వరకు) కూడా షేర్లు అమ్ముతాయి.


OFS ద్వారా తెస్తున్న మొత్తం షేర్లలో, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (QIB) 50% కోటా ఖరారు చేశారు. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు (RIIs) కోటా 35%గా ఉంది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIs) 15% రిజర్వ్‌ చేశారు.


IPOలో షేర్లు కొనాలంటే లాట్ల రూపంలో బిడ్స్‌ వేయాలి. ఒక్కో లాట్‌కు 13 షేర్లను కంపెనీ కేటాయించింది. ప్రైస్‌ బ్యాండ్‌ గరిష్ట ధర ‍(రూ. 1,080) ప్రకారం, ఒక్కో లాట్‌కు గరిష్టంగా రూ. 14,040 ఖర్చవుతుంది.


టైమ్‌ లైన్‌
–  IPOలో బిడ్స్‌ విన్‌ అయిన వాళ్లకు షేర్ల కేటాయింపు: మే 3, 2023
–  రీఫండ్‌ల ప్రారంభం: మే 4, 2023
–  డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల క్రెడిట్: మే 8, 2023
–  IPO షేర్ల లిస్టింగ్‌ తేదీ: మే 9, 2023


వ్యాపారం
హెల్త్‌ కేర్ రంగంలో అతి పెద్ద ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్స్‌లో (IPO) ఇది ఒకటి. మ్యాన్‌ఫోర్స్‌ కండోమ్స్‌ (Manforce condoms), ప్రెగా న్యూస్‌తో (Prega-news‌) జనాల్లో బాగా పాపులర్ అయింది మ్యాన్‌కైండ్ ఫార్మా (Mankind Pharma) కంపెనీ. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో సెబీకి DRHP దాఖలు చేసింది.


1991లో ప్రారంభమైన మ్యాన్‌కైండ్ ఫార్మా, మన దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటి. బ్రాండెడ్ జెనరిక్ మెడిసిన్స్‌తో పాటు; కంపెనీ అమ్ముతున్న ఫేమస్‌ బ్రాండ్లలో ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌లు, మ్యాన్‌ఫోర్స్ కండోమ్స్‌, గ్యాస్-ఓ-ఫాస్ట్ ‍‌(Gas-O-Fast) ఆయుర్వేదిక్ యాంటాసిడ్స్‌, మొటిమలను తగ్గించే ఔషధం ఆక్నీస్టార్ (AcneStar) ఉన్నాయి. 


2022లో, తన ఆరోగ్య సంరక్షణ విభాగంలో రూ. 206,82 కోట్ల ఆదాయం సంపాదించినట్లు RHPలో ఈ కంపెనీ వెల్లడించింది. 'మ్యాన్‌ఫోర్స్' బ్రాండ్‌తో, పురుషుల కండోమ్ కేటగిరీ లీడర్‌గా ఉంది. ఈ విభాగంలో దేశీయ విక్రయాలు సుమారు రూ. 461.60 కోట్లు (సుమారుగా 29.6% మార్కెట్ వాటా). ప్రెగా న్యూస్ బ్రాండ్‌తో, ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కేటగిరీలో దేశీయంగా సుమారు రూ. 184.40 కోట్ల వ్యాపారం  (సుమారుగా 79.7% మార్కెట్ వాటా) చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.