Capital Gain Tax: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత, దేశంలో అధిక సంపాదన ఉన్నవారిపై (సంపన్నులు) అధిక పన్ను విధిస్తారన్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత వచ్చింది. ప్రత్యక్ష పన్నుల చట్టంలోని (Direct Tax Code) క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో (Capital Gain Tax) మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక వివరణను జారీ చేసింది.


బ్లూంబెర్గ్ ఏం చెప్పింది?
బ్లూంబెర్గ్ (Bloomberg) రిపోర్ట్‌ ప్రకారం... ప్రత్యక్ష పన్ను చట్టాల్లో సమూల మార్పులు చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఈ చర్య తీసుకుంటుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, అధిక సంపాదనపరుల నుంచి మరింత మూలధన లాభాల పన్నును వసూలు చేయడం. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ఈ చర్య తీసుకుంటుంది.


ఈ వార్తపై ఆదాయపు పన్ను విభాగం స్పందించింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది.






                                                                              


వాస్తవానికి, ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి 2024లో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ తన నివేదికలో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా తెలిపింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్ సెన్సెక్స్‌ 0.6% పడిపోయింది.


ప్రపంచ దేశాల్లో ఆర్థిక అసమానతల ప్రయత్నాలు
ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ప్రపంచ దేశాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని బ్లూంబెర్గ్‌ తన రిపోర్ట్‌లో నివేదించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన దేశంలో కామన్ ప్రాస్పెరిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించగా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంపన్నులపై ఎక్కువ పన్నులు విధించాలని నిర్ణయించుకున్నారు. పేదరిక నిర్మూలన హామీతో, గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు సంపన్నులకు గరిష్ట ప్రయోజనాలు కల్పిస్తోందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ విమర్శలు తిప్పికొట్టి, తన ప్రతిష్టను మెరుగుపరుచుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ప్రస్తుతం సంక్లిష్ట పన్ను విధానాన్ని సరళీకృతం చేయడానికి కొత్త డైరెక్ట్ ట్యాక్స్ కోడ్‌ తీసుకురావాలని యోచిస్తోంది. తద్వారా విదేశీ పెట్టుబడిదార్లను ఆకర్షించవచ్చన్నది మోదీ ప్రభుత్వ ప్రణాళిక అని ఆ నివేదికలో ఉంది.