Work From Office: కొవిడ్‌ కారణంగా ఐటీలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) చేశారు. ఈ ప్రభావం తగ్గిపోయిన తరవాత క్రమంగా కంపెనీలన్నీ ఉద్యోగులను మళ్లీ వెనక్కి పిలుస్తున్నాయి. ఆఫీస్‌కి వచ్చే పని చేయాలని తేల్చి చెబుతున్నాయి. ఇది నచ్చిన వాళ్లు ఆఫీస్‌కి వెళ్తున్నా నచ్చని వాళ్లు మాత్రం వేరే జాబ్ చూసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇస్తే తప్ప ఉండలేమని యాజమాన్యానికి తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ఆఫీస్‌కి రాని ఉద్యోగులపై నిఘా పెడుతున్నాయి. వాళ్ల తీరుని బట్టి ఆంక్షలు విధిస్తున్నాయి. HCLTech కంపెనీ ఇప్పుడిదే చేయనుంది. లీవ్స్ విషయంలో కొత్త పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు moneycontrol వెల్లడించింది. ఇకపై ఉద్యోగుల లీవ్స్‌ని, వాళ్ల అటెండెన్స్‌తో ముడి పెట్టనుంది. వారానికి కచ్చితంగా మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చి పని చేయాలని కంపెనీ రూల్ పెట్టింది. ఈ రూల్‌ ఫాలో అవ్వని వాళ్లకు లీవ్స్ ఇచ్చే విషయంలో ఆంక్షలు పెట్టనుంది. కంపెనీ నార్మ్స్ ప్రకారం అటెండెన్స్ ఉంటేనే సెలవులు ఇచ్చేలా కొత్త నిబంధన తీసుకు రానుంది. ఈ కొత్త రూల్ ప్రకారం HCLTech ఉద్యోగులు వారానికి మూడు రోజులు కచ్చితంగా ఆఫీస్‌కి రావాలి. నెలలో కనీసం 12 రోజులైనా ఆఫీస్‌కి వచ్చి పని చేయాలి. ఒకవేళ ఉద్యోగులు ఈ రూల్‌ని పట్టించుకోకపోతే వాళ్ల సెలవుల్లో కోత పెడతారు. అంటే...ఎన్ని రోజులు ఆఫీస్‌కి రాకపోతే అన్ని రోజులు వాళ్ల లీవ్స్‌ని కట్ చేస్తారు. ఆ తరవాత కూడా రాకపోతే లాస్ ఆఫ్ పే తప్పదు. 


కమ్యూనికేషన్ పెరగాల్సిందే..


ఐదు నెలల క్రితమే హైబ్రిడ్ మోడల్‌ని అమలు చేసింది ఈ సంస్థ. కానీ చాలా మంది ఎంప్లాయీస్ ఆఫీస్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఇలా కొత్త రూల్‌తో అందరినీ వెనక్కి రప్పించాలని చూస్తోంది. ఇప్పటికే HR డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులతో ఈ నిబంధన గురించి చెబుతోంది. మెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తోంది. ప్రస్తుతానికి మూడేళ్ల లోపు సర్వీస్ ఉన్న వాళ్లకి ఏడాదికి 18 సెలవులు ఇస్తున్నారు. అంత కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటే 20 లీవ్స్ ఇస్తున్నారు. ఆఫీస్‌కి రాకపోతే ఈ లీవ్స్‌ అన్నీ వదులుకోవాల్సిందే. సీనియర్ లెవెల్ మేనేజ్‌మెంట్‌ అంతా కచ్చితంగా ఈ రూల్ ఫాలో అవ్వాలని, మిగతా ఉద్యోగులు మేనేజర్‌లు చెప్పిన దాన్ని బట్టి ఎన్ని రోజులు ఆఫీస్‌కి రావాలన్నది ప్లాన్ చేసుకోవాలని సూచిస్తోంది. కానీ మూడు రోజుల పాటు ఆఫీస్‌కి రావడమే బెటర్ అని స్పష్టం చేస్తోంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఆఫీస్‌కి రాకుండా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, వాళ్లందరిపైనా నిఘా పెడతామని కంపెనీ వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వర్క్ కల్చర్ చాలా మారిపోయిందని, కొత్త ఉద్యోగులతో పరిచయాలు కావాలన్నా, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలన్నా ఆఫీస్‌కి రావాల్సిందేనని అంటోంది. 


Also Read: Bangladesh Protests: హింసాత్మకంగా బంగ్లాదేశ్ అల్లర్లు, ఇండియాకి తిరిగొచ్చిన 300 మంది విద్యార్థులు