H3N2 Influenza Deaths in India:
కర్ణాటక, హరియాణాలో..
దేశంలో పలు చోట్ల ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కొందరు తీవ్ర జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలను ఈ ఫ్లూ ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే కలవర పెడుతుంటే ఇప్పుడు మరో వార్త షాక్‌కు గురి చేసింది. H3N2 వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. హరియాణాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్ సోకి మృతి చెందినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 90 H3N2 వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు మరో 8 H1N1 వైరస్ కేసులూ వెలుగులోకి వచ్చాయి. కొద్ది నెలలుగా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాదాపు అన్ని ఇన్‌ఫెక్షన్లకూ కారణం... H3N2 వైరసేనని వైద్యులు చెబుతున్నారు. దీన్నే Hong Kong Fluగా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారే ఎక్కువగా ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటి వరకూ ఈ రెండు వైరస్‌లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఈ రెండింటి వైరస్‌ల లక్షణాలు దాదాపు కొవిడ్ సింప్టమ్స్ లానే ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 68 లక్షల మంది మృతి చెందారు. రెండు సంవత్సరాల పాటు కరోనా పట్టి పీడించింది. ఇప్పుడు కొత్తగా ఈ వైరస్‌లు దాడి చేస్తున్నాయి.
కొవిడ్ తరహా లక్షణాలు..
దగ్గు, జ్వరం, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరులో ఒళ్లు నొప్పులు, డయేరియా లక్షణాలు కూడా ఉన్నాయి. దాదాపు వారం రోజుల పాటు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది ఈ వైరస్. దగ్గు, తుమ్ముల ద్వారా చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న వారికీ వ్యాప్తి చెందుతుందని వివరిస్తున్నారు. కొవిడ్‌కు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకున్నారో...అవే ప్రికాషన్స్‌ను కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు కచ్చితంగా నోరుని కవర్ చేసుకోవాలని ICMR సూచించింది. వృద్ధులకు రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశముందని, వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఆందోళనకు గురై వెంటనే యాంటీబయోటిక్స్ వాడొద్దని సూచించింది. వైద్యులు కూడా ఎవరికీ ఈ మందులు ప్రిస్క్రైబ్ చేయొద్దని తేల్చి చెప్పింది. వైరస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకుండానే ఎక్కువగా ఏ మందులు పడితే అవి వేసుకోవడం మంచిది కాదని వెల్లడించింది.
Also Read: Liquor Price: మందు బాబుల జేబులకు చిల్లు, ఒక్కో బాటిల్‌పై అదనపు బాదుడు