Hyderabad News: అమ్మాయి తరఫు వాళ్లు.. అబ్బాయికి కట్నం ఇవ్వడం ఆచారంగా వస్తోంది. తమ తమ స్థోమతను బట్టి కట్నకానుకలు సమర్పిస్తూ... కుమార్తెల పెళ్లిళ్లు చేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇక్కడ మాత్రం ఓ అబ్బాయి కుటుంబం.. అమ్మాయి కుటుంబానికి కట్నం ఇవ్వడానికి సిద్ధం అయింది. రెండు లక్షలు ఇచ్చి ఆమెను తమ కోడలిగా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు ఇచ్చి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరో రెండు గంటల్లో పెళ్లి ఉందనగా.. అమ్మాయి తరఫు వాళ్లు అబ్బాయి కుటుంబానికి షాక్ ఇచ్చారు. తనకు ఇచ్చే కట్నం సరిపోలేదని.. పెళ్లికి తాను ఒప్పుకోనంటూ తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోని అబ్బాయి కుటుంబ సభ్యువు పోలీసులను ఆశ్రయించారు. చివరకు ఏం చేయలేక డబ్బులు వదిలేసి మరీ వెళ్లిపోయారు. 


అసలేం జరిగిందంటే..?


మేడ్చల్-మల్కాజిగిరి పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రెండు లక్షల కట్నం ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7.21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్ కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబ సభఅయులు, బంధుమిత్రులు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ముహూర్తం సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి తరఫు బంధుగణం రాకపోవడంతో వరుడి తరఫు వాళ్లు ఆరా తీశారు. 


కట్నం చాలలేదని షాకిచ్చిన కుటుంబ సభ్యులు


అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని... అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు రప్పించారు. అయితే ముందుగా ఇచ్చిన రెండు లక్షల రూపాయలు కూడా అబ్బాయి కుటుంబ సభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.     


గతేడాది నవంబర్ లో పెళ్లిలో చికెన్ పెట్టలేదని గొడవ - పెళ్లి క్యాన్సిల్


ఇస్తామన్న కట్నం సమయానికి ఇవ్వలేదనో, అబ్బాయి వేరే వాళ్లను ప్రేమించడమో లేదో అప్పటికే వధూవరులిద్దరిలో ఒకరికి పెళ్లై పిల్లలు ఉండడం వల్లనో పీటల మీద పెళ్లి ఆగిపోవడం మనం చాలా సార్లే చూసి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం వివాహ విందులో చికెన్ పెట్టకుండా.. శాఖాహారం మాత్రమే పెట్టారని వరుడి స్నేహితులు గొడవ చేశారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో పెళ్లే ఆగిపోయింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


హైదరాబాద్ షాపూర్ నగర్ లో నవంబర్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున ఓ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. జగద్గరిగుట్ట రింగ్ బస్తీకి చెంది వరుడు, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే షాపూర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడ పెళ్లి వారు బిహార్ కు చెందిన మార్వాడీ కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. అయితే విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి స్నేహితులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదంటూ గొడవకు దిగారు. శాఖాహారం మేం తినమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రంమలోనే ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది. అయితే వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్ ను కలిసి విషయాన్ని తెలిపారు. స్పందించిన ఆయన ఇరు కుటుంబ సభ్యులను, వధూవరులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలన్నీ మర్చిపోయిన బుధువారం అంటే ఈనెల 30వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా కథ సుఖాంతమైంది.