Guruvayyur Jasmin Jaffar Controversy: పాపులర్ మలయాళీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, Bigboss మలయాళం కంటెస్ట్టెంట్ జాస్మిన్ జాఫర్ చేసిన ఓ రీల్ వివాదం రేపింది. పవిత్రమైన గురువాయర్ శ్రీకృష్ణ కోవెల కొలనులో ఆమె చేసిన వీడియో.. ప్రకంపనలు సృష్టించింది. కోవెల కొలనులో పాద ప్రక్షాళన చేయడం విమర్శలకు దారితీసింది.
వివాదం ఎందుకు..?
కేరళలోని గురువాయిర్ శ్రీకృష్ణ దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైన కృష్ణతీర్థం. అక్కడ ఆచారాలను చాలా నిష్ఠగా పాటిస్తారు. అన్యమతస్తులకు ఆలయ ప్రవేశం ఉండదు. హిందువులు కూడా పై వస్త్రాన్ని తీసేసి.. పూర్తి సాంప్రదాయ వస్త్రధారణతో గుడిలోకి అడుగుపెట్టాలి. ఆలయ నియమాలను అత్యంత కఠినంగా అమలు చేస్తారు. అయితే ఇతర మతస్థురాలైన జాస్మిన్ తన ఇన్‌స్టాగ్రమ్ రీల్ కోసం గురువయ్యూర్‌లోని స్వామివారి కోనేటిలో పాదాలను కడిగింది. ఈ రీల్ వైరల్ కావడంతో పెద్ద దుమారమే రేగింది. తరతరాలుగా కాపాడుతున్న ఆలయ సాంప్రదాయానికి భంగం కలిగిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
శుద్ధీకరణ చేస్తున్న ఆలయ బోర్డు
జరిగిన ఘటనపై గురువయ్యార్ దేవస్థానం బోర్డు Guruvayyur Devaswom Board స్పందించింది. ఆచారాలకు భంగం కలగడంతో చర్యలకు ఉపక్రమించింది. ఆరురోజుల పాటు పుణ్యావహకం ( శుద్ధీకరణ) నిర్వహిస్తామని 18 రకాల పూజలను చేస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. అలాగే ఆలయ అధికారులు టెంపుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాస్మిన్ ఆలయ నియమాలకు భంగం కలింగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆలయంలోనూ.. పవిత్ర ప్రదేశాల్లో ఫోటోగ్రఫీపై నిషేదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలోకి అన్యమతస్తులకు ప్రవేశం లేదు. ఈ విషయాన్ని నేరుగా ఫిర్యాదులో పేర్కోనప్పటికీ.. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారని చెప్పారు.
ఎవరీ జాస్మిన్ జాఫర్ Who is Jasmin Jaffar..?
24 ఏళ్ల జాస్మిన్ జాఫర్ కేరళలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ , Youtuber, కంటెంట్ క్రియేటర్. ఆమె మొదట యూట్యూబ్ చానల్‌లో బ్యూటీ టిప్స్ చెప్పడం ద్వారా ఫేమస్ అయ్యారు. ఆమె ఛానల్‌కు 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌ను 8లక్షల మంది ఫాలో అవుతున్నారు. కిందటేడాది మలయాళం బిగ్‌బాస్ సీజన్-6 ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు.. తన కో కంటెస్టెంట్‌తో అతి చనవుగా ఉంటోందని ఆమెకు కాబోయే భర్త నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి.. అప్పట్లో అది వివాదం రేపింది. ఇప్పుడు తాజాగా గురువయ్యార్‌లో చేసిన రీల్ వెంటనే వైరల్ అయ్యి వివాదానికి దారితీసింది.
క్షమాపణ చెప్పిన జాస్మిన్
తను చేసిన రీల్ వివాదానికి దారితీయడంతో జాస్మిన్ జాఫర్ క్షమాపణ చెప్పారు. అది వైరల్ అయ్యి.. నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఆమె ఆలయ నియమాలకు భంగం కలిగించిందన్న ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో జాస్మిన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఎవరి మనోభావాలను నొప్పించాలని నేను ఈ పని చేయలేదు. నాకు దానిపై అవగాహన లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. నా వల్ల జరిగిన తప్పుకు మన్నించండి” అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకున్నారు
గురవయ్యూర్ ఆలయ నిబంధనలు కచ్చితంగా అమలు చేసే విషయంలో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. విఖ్యాత గాయకుడు కె.జె.ఏసుదాసును ఆలయంలోకి అనుమతించకపోవడంపై దేశవ్యాప్త చర్చ జరిగింది. శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఆయన ఆలయం వెలుపలే గానం చేసి వెళ్లేవారు. అయినప్పటికీ నిబంధనల విషయంలో దేవస్థానం కఠినంగానే వ్యవహరించింది.