Modi Visits Bridge Collapse Site: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి మంగళవారం పర్యటించారు. మోర్బీలో తీగల వంతెన కూలిన ప్రదేశాన్ని మోదీ సందర్శించారు.


సహాయక చర్యలు, క్షతగాత్రులకు చికిత్సపై ముఖ్యమంత్రి సహా అధికారులను అడిగి మోదీ సమాచారం తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు.






ఉన్నత స్థాయి సమావేశం


మోర్బీలో పరిస్థితిని సమీక్షించేందుకు గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మోర్బీలో దుర్ఘటన జరిగినప్పటి నుంచి జరుగుతున్న సహాయ, రెస్క్యూ ఆపరేషన్ గురించి మోదీకి అధికారులు వివరించారు.


ఉన్నత స్థాయి సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్ర హోం శాఖ, గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీతో సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


9 మంది అరెస్ట్


మోబ్రీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లపై పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. సమగ్ర విచారణ కొనసాగుతోంది. మేనేజర్, సూపర్‌వైజర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన సిబ్బంది అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే ఓ అధికారి సంచలన విషయం వెల్లడించారు. ఈ వంతెనను మరమ్మతు చేయించాక ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితులు సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే ఈ వంతెనను ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న కంపెనీపైనా FIR నమోదు చేశారు పోలీసులు.


ఘోర ప్రమాదం


బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.


ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.


ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు.


Also Read: Chiranjeevi - Gareth Wynn Owen: తెల్ల దొరకు తెలుగు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్!