West Bengal News: సరదాగా షాపింగ్‌కు వెళ్లిందో యువతి. కావాల్సినవన్నీ కొనుక్కొని.. నాటీగా చాక్లెట్లను దొంగిలించింది. ఎవరి కంట పడకుండా దాచే ప్రయత్నం చేసింది. కానీ మాల్ నుంచి బయటకు వెళ్తుండగా.. ఆమె చాక్లెట్లను దొంగిలించిన విషయాన్ని సిబ్బంది గుర్తించారు. పట్టుకొని అడిగే సరికే తప్పైపోయిందంటూ సారీ చెప్పింది. చాక్లెట్లకు అయ్యే డబ్బును చెల్లించింది. చుట్టు పక్కలు చూసి.. హమ్మయ్య తెలిసిన వాళ్లెవరూ లేరని, ఇక ఈ విషయంతో ఇక్కడితో అయిపోయిందని భావించి హ్యాపీగా ఇంటికి వెళ్లిపోయింది.
మరుసటి రోజు ఉదయం రోజూలాగే కాలేజీకి వెళ్లింది. కానీ అక్కడ స్నేహితులతో కలిసి సోషల్ మీడియా చూస్తుండగా.. ఓ వీడియో చూసి షాకైంది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైంది. అది తన దొంగతనానికి సంబంధించిన వీడియోననే కావడం.. స్నేహితులంతా చూసి నవ్వడంతో పరువు పోయిందని భావించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాధ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జైగావ్ లో చోటు చేసుకుంది.
వీడియోలు డిలీట్ చేయమంటే, నెట్టింట పెట్టిన సిబ్బంది
తల్లిదండ్రుల కథనం ప్రకారం.. జైగావ్ కు చెందిన యువతి ఓ షాపింగ్ మాల్ లో చాక్లెట్లు దొంగతనం చేసింది. విషయం గుర్తించిన సిబ్బంది ప్రశ్నించగా.. డబ్బులు చెల్లించి మరీ బయటకు వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన తతంగం అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అక్కడున్న కొందరు సిబ్బంది ఆమె దొందతనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీశారు. అయితే వీటిని ఎవరికీ షేర్ చేయొద్దంటూ అక్కడున్న వాళ్లందరినీ ప్రాధేయపడింది. తప్పైపోయింది, తెలీక చేశాను.. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను.. ప్లీజ్ డిలీట్ చేయమంటూ బతిమాలింది. కానీ సిబ్బంది మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడున్న సిబ్బంది అమ్మాయి దొంగతనానికి సంబంధించిన వీడియోను, ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో స్థానికంగా వైరల్ అయ్యాయి.
ఈ విషయం తెలియని అమ్మాయి కాలేజీకి వెళ్లింది. అక్కడ తన స్నేహితులతో కలిసి ఉండగా.. ఈ వీడియోను చూసింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. స్నేహితులు, బంధువుల ముందు తన పరువు పోయిందని భావించి ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది.
మా కూతురిని తెచ్చివ్వగలరా..
మాల్ సిబ్బంది వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సదరు యువతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్లకు డబ్బులు చెల్లించాక కూడా తన కూతురిని వేధించారని మండిపడ్డారు. అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా నెట్టింట పెట్టి పరువు తీయడం ఏంటని ప్రశ్నించారు. వారు చేసిన ఈ తప్పిదం వల్ల తమ కూతురు ప్రాణాలు పోయాయని.. ఇప్పుడు తమ కూతురిని తిరిగి తెచ్చివ్వగలరా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కూతురు మృతికి కారణం అయిన సిబ్బందిని కఠినంగా శిక్షించాలని కోరుతూ.. సదరు మాల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆపై పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.