NBFCs Fixed deposit Offer: దేశ ఆర్థిక వృద్ధి వేగంగా పుంజుకుంటోంది. తయారీ రంగానికి ఊతమిచ్చేలా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాయితీలను అందుకునేందుకు అర్హత సాధించేలా, తమ ఉత్పత్తిని పెంచడానికి ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లోని కంపెనీలు పోటీ పడుతున్నాయి. సేవల రంగం కూడా రైజింగ్‌లో ఉంది. వీటి ఔట్‌పుట్‌ పెంచాలంటే ప్రస్తుతమున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం అదనపు పెట్టుబడులు కావాలి. దీంతో, ఇండస్ట్రియల్‌, నాన్‌-ఇండస్ట్రియల్‌ కంపెనీలు లోన్ల కోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (NBFCలు) చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో లోన్‌ డిమాండ్‌ కొవిడ్‌ పూర్వ స్థాయుల కంటే పెరిగింది. ఇండివిడ్యువల్‌, హౌసింగ్‌, వెహికల్‌ వంటి లోన్ల తీసుకునే వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా వృద్ధి చెందింది.


పెరిగిన లోన్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా బ్యాంకులు, NBFCల దగ్గర రెడీ క్యాష్‌ లేదు. కాబట్టి, సేవింగ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆకర్షించడం ద్వారా లిక్విడిటీ పెంచుకోవడం ప్రారంభించాయి. SBI సహా పెద్ద, చిన్న బ్యాంకులన్నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల మీద ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. 


AAA గ్రేడెడ్ NBFCలు
HDFC, బజాజ్ ఫైనాన్స్, మహీంద్ర ఫైనాన్స్, ICICI హోమ్ ఫైనాన్స్, LIC హౌసింగ్ వంటి పెద్ద సంస్థలు ట్రిపుల్-A (AAA) గ్రేడెడ్ NBFCల లిస్ట్‌ ఉన్నాయి. నమ్మకమైన సంస్థలకు మాత్రమే AAA గ్రేడ్‌ దక్కుతుంది. ఇవన్నీ, ఒకటి నుంచి ఏడు సంవత్సరాల కాల పరిమితి (మెచ్యూరిటీ డేట్‌) గత ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద సంవత్సరానికి 6.15 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్‌లు, మహిళల కోసం మరికాస్త ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి.


శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేట్ డిపాజిట్ ప్లాన్ల మీద 8.84 శాతం వడ్డీని ప్రకటించింది. లోన్‌ డిమాండ్‌ తీర్చడానికి వీలైనన్ని ఎక్కువ రిటైల్ డిపాజిట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తామని ఈ కంపెనీ ఇటీవలే ప్రకటించింది.


ఇక్కడో విచిత్రం ఏంటంటే... డిపాజిట్ల రేసులో NBFCల కంటే బ్యాంకులు వెనుకబడి ఉన్నాయి. కొన్ని బ్యాంకులు కొన్ని నిర్దిష్ట విభాగాల మీద అందిస్తున్న సగటు రేట్లు సావరిన్ బాండ్ రాబడి కంటే తక్కువగా ఉంటున్నాయి. ఇదే సమయంలో NBFCలు ఎక్కువ రేటుతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో, NBFCల చేతిలోకి వచ్చే డిపాజిట్ల సంఖ్య, విలువ పెరుగుతోంది. కరోనా మహమ్మారికి ముందు, పబ్లిక్ రిటైల్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు బ్యాంకు రుణాల మీద వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. NBFCలకు ఈ పరిస్థితి అనుకూలంగా మారింది.


ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును పెంచుతున్నా, లోన్లకు గిరాకీ పెరుగుతోంది గానీ తగ్గడం లేదు. 


ఈ సంవత్సరం మే నెల నుంచి రెపో రేటు పెంపు ప్రారంభమైంది. ఆ నెలలో 40 బేసిస్‌ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్‌ పాయింట్లు, ఆగస్టులో 50 బేసిస్‌ పాయింట్లు, సెప్టెంబర్‌లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రేటును పెంచింది. ఈ నాలుగు విడతల్లో 1.9 శాతం లేదా 190 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. దీంతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠ స్థాయి +  కరోనాకు ముందున్న స్థాయి.