BJP Gaurav Yatra: 


ఎల్‌ఈడీ ట్రక్‌లతో జోరుగా ప్రచారం


గుజరాత్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే ఆమ్ఆద్మీ పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పుడు అధికార పార్టీ భాజపా కూడా రంగంలోకి దిగింది. వేగం పెంచేందుకు సిద్ధమవుతోంది. గిరిజన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ నియోజకవర్గాల్లోనే పర్యటించాలని ప్లాన్ చేసుకుంది. "గౌరవ్ యాత్ర" (Gaurav Yatra)పేరిట ప్రచారం మొదలు పెట్టనుంది. గిరిజన నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది భాజపా. అందుకే...ఈ ప్రాంతాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. దశల వారీగా ఈ యాత్రలు చేపట్టనుంది భాజపా. మొదటి రెండు యాత్రలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వం వహించనున్నారు. మిగతా మూడు యాత్రలకు కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వం వహిస్తారు. కేంద్రమంత్రులతో పాటు సీనియర్ నేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారు. భాజపా ఎల్‌ఈడీ ట్రక్‌లు గుజరాత్‌లోని 182 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తుంది. గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఎల్‌ఈడీ తెరల్లో ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తారు. ప్రస్తుతం గౌరవ యాత్రలో భాగంగా 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా నేతలు పర్యటిస్తారు. దాదాపు 145 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. మొత్తం 5 గౌరవ యాత్రల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5,700 కిలోమీటర్లు పర్యటిస్తారు. వచ్చే వారం లేదా పది రోజుల్లోనే తొలి దశ యాత్రను పూర్తి చేస్తారు. 


ఆ సెంటిమెంట్‌ కోసమే..


గుజరాత్‌లో భాజపా గౌరవ యాత్ర చేపట్టటం ఇది మూడోసారి. 2002లో గుజరాత్ అల్లర్లు సంచలనం రేపాక...అప్పుడు తొలిసారి గౌరవ యాత్ర చేపట్టింది. పాటీదార్ ఉద్యమం తరవాత 2017లో రెండోసారి యాత్ర చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ భాజపా నెగ్గింది. అందుకే..అదే సెంటిమెంట్‌ను ఈ సారీ కొనసాగిస్తోంది. 2002లో 127 సీట్లు, 2017లో 99 సీట్లు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 27 గిరిజన నియోజకవర్గాల్లో కేవలం 9 చోట్ల మాత్రమే విజయం సాధించింది భాజపా. రెండు బీటీపీ గెలుచుకోగా..మిగతావి కాంగ్రెస్‌ అకౌంట్‌లోకి వెళ్లిపోయాయి. ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ఈ ప్రాంతాల్లో పాగా వేయాలని చూస్తోంది భాజపా. క్షేత్రస్థాయిలో భాజపా కార్యకర్తల్లో ఉత్సాహం నింపటంతో పాటు..ప్రజల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతోంది కాషాయ పార్టీ. 


త్రిముఖపోరు..


ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా తరచు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి తన కంచుకోటను కాపాడుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అటు...కాంగ్రెస్ గుజరాత్‌లో అధికారం కోల్పోయి 27 ఏళ్లు దాటింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టి...ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గుజరాత్‌లో ఆప్ గెలిస్తే...కేజ్రీవాల్ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుని 2024 ఎన్నికల్లో మోదీతో తలపడే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే...గుజరాత్‌లో గెలవటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆప్. 


Also Read: Telangana: ఏపీలో తెలంగాణ విద్యార్థి మృతి, ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య!


Also Read: Fake Astronaut: ISSలోని ఆస్ట్రనాట్‌తో మహిళ ఛాటింగ్! భూమ్మీదకి వచ్చి పెళ్లాడతానని ప్రామిస్, కోలుకోలేని షాక్