Gujarat Election 2022: 


నవంబర్ చివర్లో మొదటి విడత..?


ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ సమయంలోనే గుజరాత్‌ ఎలక్షన్ డేట్‌ని కూడా ప్రకటిస్తారని భావించినా...ఈసీ వెల్లడించలేదు. అయితే...ఈ నెల చివరి నాటికి గుజరాత్ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. మొత్తం రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో భాగంగా నవంబర్ చివరలో ఎన్నికలు నిర్వహించి...డిసెంబర్ 4-5 తేదీల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకేసారి జరగనున్నట్టు సమాచారం. గుజరాత్ అసెంబ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుంది. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో చివరిసారి 2017లో ఎన్నికలు జరిగాయి. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చింది. విజయ్ రూపానీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. ఎప్పుడైనా ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారులు గుజరాత్‌కు వెళ్లి అక్కడి స్థితిగతుల్ని పరిశీలించారట. ఎన్నికల ఏర్పాట్లు సవ్యంగా సాగుతున్నాయా లేదా అని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్‌లో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. 


త్రిముఖ పోరు..


"ఈ నెలలో ఎప్పుడైనా ఎన్నికల తేదీలు వెలువడుతుండొచ్చు. అందుకే...అన్ని పార్టీలు తమ ప్రచార వేగాన్ని రెట్టింపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి" అని గుజరాత్ రాజకీయ పరిశీలకుడు హరిదేశాయ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వారం కేంద్ర మంత్రి అమిత్‌షా గుజరాత్‌లో రెండ్రోజుల పాటు పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశమై...ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఇకపై తరచుగా రాష్ట్రానికి వచ్చి స్థానిక నేతలతో భేటీ అవనున్నారు. ఈ వారం ప్రధాని మోదీ కూడా రెండ్రోజుల పాటు గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రూ.27,000కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అహ్మదాబాద్ ట్రైన్ సర్వీసులతో పాటు...గాంధీనగర్ నుంచి ముంబయి వెళ్లే వందేభారత్‌ 
ఎక్స్‌ప్రెస్‌నూ  అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. అటు ఆప్‌ నేతలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ గుజరాత్ ఇంచార్జ్ రఘు శర్మ...ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఆప్ మాత్రం ఈ విషయంలో ముందే ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చి తన కంచుకోటను కాపాడుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అటు...కాంగ్రెస్ గుజరాత్‌లో అధికారం కోల్పోయి 27 ఏళ్లు దాటింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టి...ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 


Also Read: Owaisi on IND vs PAK: పాకిస్థాన్‌తో ఆడటం మానేయండి, అక్కడ మాత్రం ఎందుకు - అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు