Asaduddin Owaisi on IND vs PAK T20 World Cup: వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెటర్లతో పాటు మంత్రులు, అధికారులు మధ్య వాక్ యుద్ధానికి తెరతీశాయి. దశాబ్దంన్నరకు పైగా భారత్, పాక్ లు తటస్థ వేదికలపై, భారత్‌ వేదికలుగా తలపడ్డాయి కానీ పాక్ కు వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ ఇటీవల మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. జై షా చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. వద్దు అనుకుంటే పాక్ తో పూర్తిగా మ్యాచ్‌లు ఆడటం మానేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర మ్యాచ్‌లు ఆడొద్దనుకుంటే ఆడకుండా ఉండండి, దేశం కంటే మీకు క్రికెట్ ముఖ్యమా.. మరి పాక్‌ గడ్డమీద దాయాదితో ఆడేందుకు ఆసక్తి చూపని టీమిండియా ఆస్ట్రేలియాలో ఎందుకు ఆడుతుందని ప్రశ్నించారు. మా జీవితంలో అన్నిసార్లు పాకిస్థాన్ పేరు తీయం. మీరెందుకు పాక్ పేరు ఎత్తుతారు. ఇష్టం లేకుంటే రేపు ఆస్ట్రేలియాలో పాక్ తో మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు. ఇష్టం లేకుంటే మానేయండి. దేశం కంటే మీకు క్రికెట్ ముఖ్యమా అని ప్రశ్నించారు. పాక్ వెళ్లి పాకిస్థాన్ తో ఆడేందుకు ఆసక్తి చూపని వాళ్లు ఆస్ట్రేలియాలో క్రికెట్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 






ఆడకపోతే ఏమవుతుందంటే.. 
భారత్, పాక్ మ్యాచ్ ఆడకపోతే జరిగేది ఇదేనంటూ అసదుద్దీన్ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ‘పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకపోతే ఏమవుతుంది. కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. దేశం కంటే మీకు క్రికెట్ ముఖ్యమా. ఇదేనా ఆట మీద మీకున్న ప్రేమ అని ప్రశ్నించారు. రేపు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియదు. గెలిస్తే షేర్ షేర్ అని అరుస్తారు. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్. భారత్ గెలవాలని మేం కూడా కోరుకుంటాం. షమీ, మన కుర్రాడు మహ్మద్ సిరాజ్ పాక్‌ను ఓడించడంలో తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. అయితే మ్యాచ్ గెలిస్తే జిందాబాద్ అంటారు. ఓడిపోతే మాత్రం దారుణంగా విమర్శిస్తారు. ఇదెక్కడి పద్ధతి. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే. మా పద్ధతులు అంటే ఎందుకు వ్యతిరేకిస్తారు. వాటితో మీకొచ్చే నష్టం ఏంటి. అన్ని విషయాల్లో ఎందుకు అత్యత్సహం ప్రదర్శిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ అంటే కూడా మీకు మాతో ఇబ్బంది’ అంటూ మెల్‌బోర్న్‌లో భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.