Gujarat Election 2022:
ఉన్నట్టుండి నినాదాలు..
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు వేగం పెంచాయి. ఇప్పటి వరకూ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే క్యాంపెయిన్ మొదలు పెట్టాయనుకుంటే...అటు AIMIM కూడా రంగంలోకి దిగింది. సూరత్‌లో అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభలో మాట్లాడుతుండగా...అనూహ్య ఘటన జరిగింది. జనంలో నుంచి కొందరు "మోడీ మోడీ" అని నినాదాలు చేశారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. నల్లజెండాలు చూపిస్తూ మోడీ అని కొందరు యువకులు నినాదాలు చేయటం వల్ల సభలో గందరగోళం నెలకొంది.
ఒవైసీ ప్రచారం..
గుజరాత్ ఎన్నికల్లో సడెన్ ఎంట్రీ ఇచ్చింది AIMIM పార్టీ. ఇన్నాళ్లూ ప్రచారం ఊసే ఎత్తని ఆ పార్టీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. స్వయంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. వచ్చీ రావటంతోనే ఓ అస్త్రం ప్రయోగించారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే "గోవధ శాలలను" పెంచుతామని సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు. ఈ ఎన్నికల్లో "M" ఫార్ములాను అనుసరిస్తోంది ఆ పార్టీ. ముస్లిం ఓట్లను టార్గెట్ చేయడం, ముస్లిం అభ్యర్థినే నిలబెట్టడం, వాటితో పాటు ముస్లింల సమస్యలను ప్రస్తావించటం...ఈ వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోంది. ఇదే "M"ఫార్ములాతో ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది AIMIM.ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటెజీతో బరిలోకి దిగుతోంది. ఈ సారి గోవధశాలలు పెంచుతామంటూ ప్రకటించడం అక్కడి రాజకీయ వేడిని పెంచింది. "ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కరిస్తానని మాటిస్తున్నాను" అని వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ. అంతే కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తానన్న బీజేపీ హామీపైనా ఒవైసీ విమర్శలు చేశారు.
యూసీసీపైనా విమర్శలు..
కేవలం గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు దక్కించుకునేందుకు భాజపా ఈ వ్యూహంతో ముందుకొచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. "నాకిదేమీ ఆశ్చర్యం కలిగించటం లేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ భాజపా తమ రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తూనే ఉంటుంది. ఇది ఊహించిందే. వాళ్లు ఇంతటితో ఆగరు. ఇంకెంతో చేస్తారు" అని విమర్శించారు. "భాజపా ఎప్పుడూ నిజమైన సమస్యలపై చర్చించదు. గుజరాత్‌లో కొవిడ్ సమయంలో వైరస్‌ను కట్టడి చేయటంలో దారుణంగా విఫలమయ్యారు. ఆక్సిజన్ పడకల కోసం ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. కొందరు చివరకు ప్రాణాలూ వదిలారు. ఇప్పుడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేవలం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)ని తెరపైకి తీసుకొచ్చింది" అని అన్నారు అసుద్దీన్ ఒవైసీ.
Also Read: Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం, ఆ ఇద్దరికి బెయిల్ మంజూరు!