Organ Donation Law:
వన్ నేషన్, వన్ పాలసీ..
అవయవ దానం విషయంలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. వన్ నేషన్, వన్ పాలసీలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. అవయవదానంతో పాటు అవయవ మార్పిడిలోనూ మార్పులు చేర్పులు చేసింది. ఈ ప్రక్రియలను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అవయవ మార్పిడి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. కానీ...చనిపోయిన తరవాత అవయవ దానం చేస్తున్న వారి సంఖ్య మాత్రం 0.01%మే. ఇవి స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన లెక్కలే. ఇకపై వీటిని ప్రోత్సహించేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏమే మార్పులంటే..?
65 ఏళ్లు పైబడిన రోగులెవరైనా చనిపోయిన వాళ్ల నుంచి "అవయవం పొందేందుకు" వీలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. గతంలో ఈ వయో పరిమితి 65గా ఉండేది. ఇప్పుడు 65 ఏళ్లు దాటిన వాళ్లు కూడా అవయవాలు పొందేందుకు అవకాశముంటుంది. 65 ఏళ్ల వాళ్లను ఈ విషయంలో "వృద్ధులుగా" పరిగణించడం సరి కాదని, అందుకే మార్పులు చేశామని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే...ఎక్కువ కాలం బతికుండే అవకాశమున్న యువతీ, యువకులకు అధిక ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది. మొత్తానికైతే...ఇప్పుడు ఎవరైనా సరే చనిపోయిన వారి నుంచి అవయవాలు తీసుకునేందుకు "రిజిస్టర్" చేసుకోవచ్చు. NOTTO వెబ్‌సైట్‌లో ఈ కొత్త గైడ్‌లైన్స్‌ని అప్‌డేట్ చేశారు. అవయవాలు తీసుకునేందుకు రిజిస్టర్ చేసుకునే వాళ్లకు ఎలాంటి ఫీజ్ వసూలు చేయరు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో కొంత మేర రుసుము వసూలు చేసే వాళ్లు. ఇకపై ఈ ఛార్జీలు విధించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
వైద్యుల డిమాండ్..
జనవరి 9వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ పాలసీపై చర్చించింది. అసలు ఈ మార్పులకు కారణం...గతేడాది సెప్టెంబర్‌లో ఓ బాలుడు వేసినే పిటిషన్. ఓ 17 ఏళ్ల కుర్రాడు తన తండ్రికి కాలేయ దానం చేయాలని భావించాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. చేసేదేమీ లేక ఆ కుర్రాడు సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు, అందులోనూ మైనర్లు అవయవ దానం చేయొచ్చా అన్న చర్చ అప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మైనర్లు అవయవ దానం చేసేందుకు వీల్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప అందుకు ఆమోదం లభించదు. మైనర్లూ అవయవదానం చేసేలా చట్టంలో మార్పులు చేసే బదులు...చనిపోయిన వాళ్లు తప్పనిసరిగా అవయవదానం చేయాలన్న నిబంధన పెట్టాలని కొందరు వైద్యులు డిమాండ్ చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే...ఓ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తి నుంచి మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అవయవం దానం చేస్తే...మృతుడి "నివాస ప్రాంత ధ్రువీకరణ పత్రం"సమర్పించాల్సి ఉండేది. ఇప్పటి నుంచి ఈ నిబంధనను పక్కన పెట్టేయాలని కేంద్రం ఆదేశించింది.