Google Layoffs:


భారీగా లేఆఫ్‌లు..? 


2022లో మొదలై లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బడా కంపెనీలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో గూగుల్ కూడా ఉంది. అమెజాన్, మెటా తరహాలోనే లేఆఫ్‌లు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఓ విడత పూర్తి కాగా...మరో రౌండ్‌ కూడా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ స్వయంగా ఇదే విషయం వెల్లడించారు. Wall Street Journal మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రస్తుతానికి కంపెనీ దృష్టంతా ఆపరేషన్స్‌పైనే ఉందని, పనులు వేగవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రయారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నట్టు వివరించారు. ఈ సమయంలోనే లేఆఫ్‌లు కూడా ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కన్నా 20% సమర్థంగా పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. రోజురోజుకీ పనులు వేగం పుంజుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. ఖర్చులను కూడా అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. లేఆఫ్‌ల ద్వారా ఖర్చులు తగ్గుతాయని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎంత మందిని తొలగిస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే దృష్టి సారించింది. దీనిపైనే నిత్యం పని చేస్తున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు. కీలకమైన పనులన్నింటికీ ఈ టెక్నాలజీ వాడనున్నట్టు చెప్పారు. అయితే...ఈ ఏరియాలో ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 


స్నాక్స్ బంద్...


గూగుల్ కంపెనీ (Google)లో ఉద్యోగమంటే సకల సౌకర్యాలు ఉంటాయని, అందులో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అని భావించడం గ‌త వైభ‌వంగా మార‌నుంది. ప్రపంచంలో అత్యంత విలువైన టెక్‌ కంపెనీల్లో అగ్ర‌ స్థానంలో ఉన్న గూగుల్‌ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అందుకే ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్ని ప్రోత్సాహకాల్ని రద్దు చేయ‌డంతో పాటు, నియామకాల్ని తగ్గించ‌డం ద్వారా పొదుపు చ‌ర్య‌లు ప్రారంభించింది. త‌న ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్‌లు ఇచ్చి మ‌రీ ప్రోత్సహించిన గూగుల్.. ఇక నుంచి వాటిని నిలిపివేయనుంది. స్నాక్స్, లంచ్, లాండ్రీ సర్వీస్… ఇలాంటి వసతులన్ని నిలిపేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు గూగుల్ చీఫ్ ఫైనాన్సియ‌ల్ ఆఫీస‌ర్ (CFO) రూత్ పోరాట్ ఉద్యోగుల‌కు రాసిన లేఖ‌లో తెలిపారు. ఆహార వృధాను అరిక‌ట్ట‌డంతో పాటు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకునేందుకు ఈ చ‌ర్య‌లు చేపట్టామ‌ని వెల్ల‌డించారు. ఈ ఉచిత సౌకర్యాలకు పెట్టే డబ్బుతో… వేరే ఇతర ప్రాధాన్యాల వైపు మళ్లించడమే తమ లక్ష్యమని ఆ లేఖలో స్పష్టం చేశారు. కొత్త నియామకాలను కూడా తగ్గించామని.. ప్రస్తుతమున్న ఉద్యోగులను హై ప్రయారిటీ పనులకు వినియోగించుకుంటామని  రూత్ పోరాట్ తెలిపారు. ఇప్పుడు మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయని చెప్పడం ఆ కంపెనీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 


Also Read: Karnataka Election 2023: కర్ణాటక బీజేపీలో అసమ్మతి సెగ, టికెట్ దక్కలేదని పార్టీ వీడిన కీలక నేత