కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించారు. అగ్ర హీరోలు ఉపేంద్ర - సుదీప్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా అభిమానులను బాగానే అలరించింది. దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా మార్చి 17న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఓటీటీలో విడుదలకు రెడీ అయిన 'కబ్జా'
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందుకోసం ఫ్యాన్సి అమౌంట్ ను చెల్లించినట్లు తెలుస్తోంది. కన్నడ యాక్షన్ డ్రామా ‘కబ్జా’ గ్లోబల్ స్ట్రీమింగ్ ప్రీమియర్‌ను ప్రకటించింది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి కన్నడలో తమిళం, తెలుగు, మలయాళం, హిందీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
'కబ్జా' మూవీ కథేంటంటే?
ఇక ఈ సినిమా కథ 1942లో మొదలవుతుంది. బ్రిటీష్ పాలనలో ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన ఉపేంద్ర, అనివార్య పరిస్థితుల కారణంగా అండర్ వరల్డ్ లోకి ఎలా ప్రవేశించాడు? ఆ తరువాత అండర్ వరల్డ్ ని శాసించే డాన్ గా ఎలా ఎదిగాడు? అండర్ వరల్డ్ ని రూపుమాపడానికి వచ్చిన పోలీసు అధికారి సుదీప్, ఇతర శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాశంతో 'కబ్జా' సినిమాను తెరకెక్కించారు. అండర్ వరల్డ్ డాన్ గా ఉపేంద్ర, పోలీస్ గా సుదీప్ ఆకట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా కనిపించారు. కన్నడ సీనియర్ హీరో శివన్న ఈ చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
కీలక పాత్రల్లో ఆకట్టుకున్న ప్రముఖ నటీనటులు
ఈ చిత్రంలో శ్రియా శరణ్ తో పాటుగా మురళీ శర్మ, కోట శ్రీనివాస్, పోసాని కృష్ణ మురళి, సుధ, కబీర్ దుహన్ సింగ్, నవాబ్ షా, దేవ్ గిల్ తదితరులు నటించారు. 'కబ్జా' చిత్రాన్ని శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ సినిమాస్ బ్యానర్స్ పై ఆర్. చంద్రు భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలంకార్ పాండియన్, ఆర్కా సాయి కృష్ణ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బసృర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.