ఈ మధ్య సోషల్ మీడియాలో పరకాల ప్రభాకర్ పోస్టులు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ పోస్టులు ఆయనే పెడుతున్నారా లేకుంటే అకౌంట్ హ్యాక్ అయిందా అనే అనుమానం చాలా మందికి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఆయన స్పృహలో ఉండి తానే ఆ పోస్టులు పెడుతున్నట్టు చెప్పుకున్నారు కూడా. దీంతో అసలు వివాదం ఎక్కడ మొదలైందని చాలా మంది నెటిజన్లు తీగ లాగడం మొదలు పెట్టారు.
పరకాల ప్రభాకర్... తెలుగు రాజకీయాలు ఫాలో అయ్యేవారికి బాగా తెలిసిన వ్యక్తే. విద్యాధికుడిగా పేరున్న పరకాల ఈటీవీలో చర్చా గోష్టి నిర్వహించేవారు. అక్కడి నుంచి సడెన్‌గా రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యంలో చేరి రాజకీయంగా తన ఫేట్‌ను పరీక్షించుకున్నారు. అక్కడ ఇమడ లేక బయటకు వచ్చేశారు. 2014లో టీడీపీకి దగ్గరై ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్రనే పోషించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.
ఎలాంటి సందర్భంలోనూ తొణకని.. మాట జారని వ్యక్తిగా కనపడే పరకాల ప్రభాకర్ సోషల్ మీడియాలో బీభత్సకాండ సృష్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెడుతున్న పోస్టులు ఆయన అభిమానులనే కాదు సామాన్య జనాన్ని కూడా షాక్‌కు గురి చేస్తున్నాయి. బూతులతో రెచ్చిపోతున్న ఆయన పోస్టుల వెనుకున్న వివాదంపై అందరి ఫోకస్ ఉంది.
ముఖ్యంగా జనసేన అభిమానులకు ఆయనకు మధ్య పెద్ద వార్ జరుగుతోంది. సోషల్ మీడియాలో రెండు వర్గాలు పోటాపోటీ బూతుల యుద్ధం నడుస్తోంది. గత 4 రోజులుగా సాగిన బూతుల వార్‌కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు పరకాల ప్రభాకర్ పోస్ట్ చేశారు.
గొడవ ఇలా మొదలైంది:
2021 డిసెంబర్ 10 న పరకాల ప్రభాకర్ ఉస్మానియా యూనివెర్సిటీలో జరిగిన TEDx టాక్‌లో తన ఆన్లైన్ ప్రసంగం యూట్యూబ్ లింక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 5 రోజుల క్రితం రాజేష్ చిరు007 అనే నెటిజెన్ " డబ్బులకు అమ్ముడు పోయి ఉన్న పార్టీపై ఫేక్ ఆరోపణలు చేసే వాళ్ళు కూడా TEDx టాక్‌లో ప్రసంగించడం ఏంటి" అంటూ పరకాల ను ఉద్దేశించి రిప్లై ఇవ్వడంతో వివాదం మొదలైంది.
ఆ నెటిజన్ యాక్షన్‌కు పరకాల చాలా వల్గర్‌గా రియాక్ట్ అయ్యారు. విపరీతమైన బూతు పదజాలంతో సమాధానం ఇచ్చారు. ఇది చూసిన చాలా మంది షాక్‌కు గురయ్యారు. ఎప్పుడూ మర్యాదతో తప్పని మాట తీరుతో ప్రవర్తించే పరకాల నుంచి ఇలాంటి భాష ఊహించ లేదు. అందుకే పరకాల ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నారు.
చాలా మందికి పరకాలకు పర్సనల్‌గా కూడా మెసేజ్‌లు పెట్టారు. అకౌంట్ హ్యాక్ అయిందా అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానంగా మరో పోస్టు పెట్టారు పరకాల. తన అకౌంట్ హ్యాక్‌కు గురి కాలేదని పరకాల పోస్ట్ ప్రత్యక్షమైంది. పూర్తి స్పృహతోనే పోస్టులు పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనను బూతులు తిడుతున్న వారితో మర్యాదగా మాట్లడటం మానేశానంటూ చెప్పుకొచ్చారు. వారు ఏ భాషలో మాట్లాడితే తాను అదే భాషలో రిప్లై ఇస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు.
పరకాల రిప్లైకి జనసేన అభిమానులుగా చెప్పుకుంటున్న వారు రెచ్చిపోయారు. ఒక్కసారిగా పరకాలపై సోషల్ మీడియాలో బూతులతో దండెత్తారు. వారికి ఏమాత్రం తగ్గకుండా పరకాల ప్రభాకర్ కూడా కౌంటర్లు ఇస్తూ వచ్చారు. 5 రోజులపాటు సోషల్ మీడియాలో జరిగిన ఈ వార్ చివరికి సద్దుమణిగింది.
పనీ పాట లేకుండా తనపై బూతులతో విరుచుకు పడ్డ వారంతా తన ఎదురు దాడితో తోక ముడిచారనీ ఇంతటితో ఈ గొడవను ముగిస్తున్నానని చెప్పుచొక్కారు పరకార. వారు గనుక మళ్ళీ తలెత్తితే తాను మరింత పదునైన పదజాలంతో విరుచుకుపడతానంటూ వార్ణింగ్ ఇస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
షాక్ లో నెటిజన్స్ :
పరకాలను అనేక పాత్రల్లో చూసిన జనాలు ఆయన ట్విట్టర్‌లో వాడిన భాష పెట్టిన పోస్టులు చూసి షాక్ తిన్నారు. టీవీల్లోనూ, సభల్లోనూ, ప్రత్యక్షంగానూ ఆయన మాటతీరు తెలిసిన వారంతా పరకాల నుంచి ఈ లాంగ్వేజ్ ఊహించలేదు అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ఎవరి ఫోన్ కాల్స్ పెద్దగా అటెండ్ చెయ్యడం లేదు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు మాత్రం ఆ అకౌంట్, ఆ పోస్టులు ఆయనవేనని నిర్ధారించారు. తనపై దాడి చేస్తున్న వారిని వారి రూట్ లోనే ఎదుర్కోవడం కోసమే ఆ భాష ను పరకాల ప్రభాకర్ వాడారని చెబుతున్నారు .
ప్రజారాజ్యం కాలం నుంచి పరకాలపై ఆగ్రహం
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించారు పరకాల ప్రభాకర్. అయితే మధ్యలో వచ్చిన బేధాభిప్రాయాలతో ఆయన పార్టీ ఆఫీసులోనే ఆ పార్టీ ఒక విష వృక్షం అంటూ విమర్శలు చేశారు. అనంతరం దాని నుంచి బయటకు వచ్చేసారు. ఆ తరువాత కొన్నేళ్ళకు జనసేన పార్టీ పెట్టడం ఒకానొక సందర్భంలో పవన్ మాట్లాడుతూ ప్రజారాజ్యంపై పరకాల ప్రభాకర్ ఆరోపణలు చేసిన టైంలో తాను అక్కడ లేకపోవడం పరకాల అదృష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో జనసేన అభిమానులు పరకాల ప్రభాకర్‌ను ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేస్తూ వచ్చారు. వారి వేధింపులు చూసి చూసి ఇక వారికి చెక్ పెట్టడం కోసమే పరకాల చివరికి ఈ రూట్ ఎంచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు .