YSR EBC Nestham: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (బుధవారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన పేదలకు ఈ పథకం ద్వారా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు..
మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం...
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించింది.
ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుకగా... వైఎస్సార్ ఈబీసీ నేస్తంను అభివర్ణిస్తున్నారు. తాజాగా అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ. 30,000. వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిచింది.(డీబీటీ మరియు నాన్ డీబీటీ)
ఉద్యోగ, రాజకీయ సాధికారత...
వాలంటీర్ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలే, 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే ఇచ్చామని, రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే కేటాయింపు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌లుగా 51 శాతం మహిళలకే, డైరెక్టర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్‌పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు మహిళలకు కేటాయించటం ప్రత్యేకగా చెబుతున్నారు.
శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం, కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ఇచ్చామని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్‌పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకే అవకాశాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మార్కాపురానికి సీఎం జగన్..
బుధవారం (12.04.2023) సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం లో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. 10.15 – 12.05 గంటలకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద, వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేయనున్న సీఎం జగన్, కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.