Google Layoff employee laid off at 2am, thought layoff email was spam ignored it:
లే ఆఫ్‌ల కాలంలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఒక్కొక్కరిది ఒక్క రకమైన స్టోరీ. ఇటీవల గూగుల్ కు చెందిన ఓ ఉద్యోగిని ఆ సంస్థ తీసేసింది. ఆ విభాగానికి హెడ్ గా ఉన్న తనకు కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లుగా ఈమెయిల్ వచ్చింది. చాలా కష్టపడి పని చేస్తున్నా, హెడ్ గా ఉన్నా నన్నెందుకు తీసేస్తారనుకుని ఆ ఈమెయిల్ ను స్పామ్ అనుకుని లైట్ తీసుకున్నాడు తర్వాతే తత్వం బోధపడి తమాయించు కున్నాడు. ఉద్యోగం కోల్పోయిన 12 వేల మందిలో తాను ఒకడినని తెలుసుకున్నాడు.
ఇండియన్-అమెరికన్ అయిన విశాల్ అరోరా.. కాలిఫోర్నియాలోని గూగుల్ కార్యాలయానికి (Google Office) ఇంజినీరింగ్ హెడ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ రోజు విశాల్ అరోరాకు లేఆఫ్ మెయిల్ వచ్చింది. కానీ దానిని స్పామ్ కావచ్చునని భావించి లైట్ తీసుకున్నాడు. తనను గూగుల్ సంస్థ ఎంత నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగంలో నుంచి తీసేసిందో తన లింక్డ్ ఇన్ లో రాసుకొచ్చాడు. మంచి ఫలితాలు తీసుకువస్తున్నప్పటికీ తను ఉద్యోగం కోల్పోవడం పట్ల ఎంత నిరాశగా ఉందో చెప్పాడు. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో అందులో వ్యక్తం చేశాడు.
నోటీస్ రిగార్డింగ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్..
విశాల్ అరోరాకు చెందిన వ్యక్తిగత ఈమెయిల్ కు ఓ రోజు తెల్లవారుజామున 2 గంటలకు 'నోటీస్ రిగార్డింగ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్' అని సబ్జెక్ట్ తో ఉన్న ఇమెయిల్ వచ్చింది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు విశాల్ అరోరా. ఉదయం 7 గంటలకు తాను హాజరు కావాల్సిన సమావేశానికి సిద్ధమవుతున్నాడు. కానీ అతను తన ఫోన్ లో తన కార్పొరేట్ క్యాలెండర్ ను చెక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది సిస్టమ్ నుంచి లాక్ చేసినట్లుగా గుర్తించి ఖంగు తిన్నాడు.
మనం చేసే పని పైస్థాయి వారికి కూడా తెలిస్తేనే గుర్తింపు
'గూగుల్ లో పని చేస్తున్నప్పుడు నా యాజమాన్యం నా వెనక ఉందని అనుకున్నాను. కాబట్టి నేను వృత్తిపై దృష్టి పెట్టాను. అంచనాలు అందుకునేందుకు కష్టపడ్డాను. మీరు చేస్తున్న పని, అందుకుంటున్న అంచనాల గురించి కేవలం మీ పైనున్న మేనేజర్ కు మాత్రమే తెలిస్తే సరిపోదు. వారి పైనున్న వారికి కూడా తెలిసేలా చేయాలి. నిరంతరం కలవడం, మెసేజీలు పంపించడం లాంటివి చేస్తున్నప్పుడే వారు మన గురించి తెలుసుకోగలుగుతారు.' అని విశాల్ తన లింక్డిన్ లో రాసుకొచ్చాడు.
16 వారాల జీతం
తొలగించిన ఉద్యోగులకు 16 వారాల జీతం సహా ఒక సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తున్నట్లు గూగుల్ ఒక బ్లాగ్ పోస్టు (Google Blog Post )లో తెలిపింది. బోనస్ లు, మిగిలిపోయిన సెలవులకు వేతనాన్ని కూడా అందిస్తోంది. 6 నెలల ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ నియామక సేవలు, ఇమ్మిగ్రేషన్ సపోర్టు కూడా అందిస్తోంది.