Sundar Pichai on Google Layoffs:


గూగుల్‌ లేఆఫ్‌లు..


దాదాపు ఏడాది కాలంగా బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. విడతల వారీగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో గూగుల్‌ టాప్‌లో ఉంటుంది. ఏడాదిలో 12 వేల మందిని (Google Layoffs) తొలగించింది ఈ కంపెనీ. ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఈ లేఆఫ్‌లపై స్పందించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గూగుల్ పేరెంట్ కంపెనీ Alphabet వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 6% మందిని తొలగించినట్టు వెల్లడించారు. ఆర్థిక పరంగా జరుగుతున్న మార్పులను అందిపుచ్చుకోడానికి, మార్కెట్‌లో కంపెనీ పొజిషన్‌ని మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు సుందర్ పిచాయ్. అయితే...ఉద్యోగం కోల్పోయిన వాళ్లలో చాలా మంది సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదనతో పోస్ట్‌లు పెడుతున్నారు. తమ జీవితంలో ఇది చాలా టఫెస్ట్ ఫేజ్ అని చెబుతున్నారు. దీనిపై స్పందించారు పిచాయ్. కంపెనీకి వేరే ప్రత్యామ్నాయం లేక ఇలా చేయాల్సి వచ్చిందని, లేఆఫ్‌లలో ఇంకా జాప్యం జరిగుంటే కంపెనీ సమర్థతపై అది ప్రభావం చూపించి ఉండేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 12న జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. ఇదే సమయంలో లేఆఫ్‌లను మరికొంత పద్ధతిగా చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. ఈ లేఆఫ్‌ల వల్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడిందన్న ప్రశ్నకీ సమాధానమిచ్చారు. కచ్చితంగా ఇంపాక్ట్ చూపించిందని, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని వివరించారు. ఏ సంస్థకైనా ఇలాంటివి ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు. పాతికేళ్లలో గూగుల్‌ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదని అన్నారు. 


"మేం లేఆఫ్‌లను జాప్యం చేసి ఉంటే అది కచ్చితంగా చాలా పెద్ద తప్పే అయ్యుండేది. కంపెనీకి భారీ నష్టం కలిగించేది. దాదాపు ఏడాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ వస్తున్నాం. మార్కెట్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నిలదొక్కుకోవాలంటే ఇలాంటివి తప్పవు"


- సుందర్ పిచాయ్, గూగూల్ సీఈవో


గూగుల్ ఉద్యోగులు మాత్రం కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్‌కు షాక్ ఇచ్చారు. ఉద్యోగులను కాస్త గౌరవంగా చూసుకోవాలంటూ గతంలో లెటర్ రాశారు. 1,400 మంది ఉద్యోగులు ఈ మేరకు పిటిషన్‌పై సైన్ చేశారు. ఈ లెటర్‌లో పలు డిమాండ్‌లు చేశారు. కొంత కాలం పాటు రిక్రూట్‌మెంట్‌ను ఆపేయాలని తేల్చి చెప్పారు. ఒకవేళ రిక్రూట్‌మెంట్ జరిగినా...ఇప్పటికే జాబ్ పోయి అవకాశం కోసం చూస్తున్న వారికే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యవసర సమయాల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే వాటిని పెయిడ్‌ ఆఫ్‌గా పరిగణించాలి. ఉదాహరణకు పేరెంటల్ సెలవులను కోట్ చేశారు ఉద్యోగులు. అంతే కాదు. సంక్షోభంలో ఉన్న దేశాల్లోని ఉద్యోగులను తొలగించకుండా చూడాలని సూచించారు.వీసా సంబంధిత సమస్యల్నీ పరిష్కరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తున్న ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ...దీనిపై తాము మాట్లాడాల్సిన అవసరముందని అన్నారు. 


Also Read: ఫేస్‌బుక్ మాజీ మేనేజర్ చేతివాటం, కంపెనీ ఖజానా నుంచి రూ.32 కోట్లు చోరీ - ఆ డబ్బుతో జల్సాలు