Topudurthi Prakash Reddy :   వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ పై అనుమానం పెరిగిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు  నిరాశకు గురవుతున్నారు. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి.  ఎమ్మెల్యేగా గెలిచిన తనకు చాలా అసంతృప్తి ఉందని..  నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో చేద్దాం అనుకున్నా....కాని అనుకున్న స్థాయిలో చేయలేకపోయానన్నారు.  రాబోయే ఎన్నికల్లో ( Elections ) రాప్తాడు నుంచే పోటీ చేసి... గెలుస్తానని  తర్వతా అభివృద్ధి చేస్తానన్నారు. రాప్తాడు నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో రోడ్ల కాంట్రాక్టులను పరిటాల సునీత బంధువులే తీసుకున్నారని కానీ వారు పనులు చేయడం లేదని ఆరోపించారు.                         


రాప్తాడు నియోజకవర్గ పరిధిలో 33 గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కరపత్రాలు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు.  రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్ట్ దక్కించుకున్న పరిటాల సునీత ( Paritala Suntha )  కుటుంబీకులు పనులు చేయడం లేదన్నారు.  వచ్చే సోమవారం కల్లా పనులు ప్రారంభించకపోతే....పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.  రాబోయే వంద రోజుల్లో వంద కిలో మీటర్లు నియోజకవర్గం పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. రాప్తాడులో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. దాంతో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రోడ్ల నిర్మాణాన్ని చేస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు.                                                                           


 రాప్తాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆయనకూ టిక్కెట్ నిరాకరించవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై విస్తృత ప్రచారం జరుగుతూండటంతో.. ప్రకాష్ రెడ్డి కంగారు పడుతున్నారు. అందుకే ఆయన తనకూ అసంతృప్తి ఉందని.. ఏమీ చేయలేకపోయానని ఆయన అంటున్నారు. రాప్తాడులో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా పరిటాల కుటుంబం ఉంది. వారికి టిక్కెట్ల విషయంలో ఢోకా లేదు. వారు పోటీ చేయడం ఖాయం.. తన టిక్కెట్ డొలాయమానంలో పడటంతో ..  ప్రకాష్ రెడ్డి అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.                       


ప్రెస్మీట్‌లో పరిటాల కుటుంబంపైనా విరుచుకుపడ్డారు.   పరిటాల కుటుంబం రాప్తాడులో పాసింగ్ క్లౌడ్స్...వచ్చి వెళ్ళే మేఘాలు లాంటి వాళ్ళన్నారు.  ధర్మవరం టిక్కెట్ కోసం పరిటాల శ్రీరామ్ ఇరవై కోట్లు చంద్రబాబు దగ్గర డిపాజిట్ చేశార్నారు.  రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల కుటుంబం అవసరం లేదని ఆరోపించారు.