కంపెనీపై పిటిషన్ వేసి నెగ్గిన మహిళా ఉద్యోగులు 


ఆడవాళ్లమైతే మాకు తక్కువ జీతాలివ్వాలా..? మేం చేసే పనేమైనా తక్కువా..? మగవాళ్లతో సమానంగా మాకూ జీతాలివ్వాల్సిందే అంటున్నారు గూగుల్ కంపెనీలోని మహిళా ఉద్యోగులు. డిమాండ్ చేయటం మాత్రమే కాదు. ఏకంగా గూగుల్‌ కంపెనీపై కేసు వేసి నెగ్గారు కూడా. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగిందీ ఈ ఘటన. గూగుల్ కంపెనీలోని పలువురు మహిళా ఉద్యోగులు తమ కన్నా పురుషులకే ఎక్కువ జీతాలిస్తూ లింగవివక్షచూపిస్తున్నారంటూ గూగుల్ యాజమాన్యంపై కాలిఫోర్నియా కౌంటీలోని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తామూ పురుషులతో సమానంగా కష్టపడుతున్నప్పుడు ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నించారు. 2013 నుంచి రకరకాల పొజిషన్స్‌లో పని చేస్తున్న 15,500 మంది మహిళా ఉద్యోగుల తరపున పిటిషన్ వేశారు. ఈ విషయంలో గూగుల్‌ డిఫెండ్ చేసుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. పిటిషన్ వేసిన వారందరికీ నష్టపరిహారంగా 118 మిలియన్ డాలర్లు చెల్లించింది. 


60 రోజుల్లోగా పరిహారం చెల్లించాల్సిందే..


ఇప్పటి నుంచి గూగుల్‌లో రిక్రూట్‌ ప్రాసెస్‌ చాలా పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం థర్డ్‌పార్టీ ఎక్స్‌పర్ట్‌ను నియమించుకోవాలని సూచించింది. ఈ కంపెనీలో శాలరీల విషయంలో ఎలాంటి వివక్ష చూపించకుండా ఉండేలా నిపుణుల సలహాలు పాటించాలని తేల్చి చెప్పింది. మూడేళ్ల పాటు ఎక్స్‌టర్నల్ సెటిల్‌మెంట్ మానిటర్ పరిధిలో గూగుల్ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి తీర్పుల ద్వారా మహిళలు తక్కువ అన్న భావన తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు మహిళా ఉద్యోగులు. ఒక్కో మహిళా ఉద్యోగికి 50 వేల డాలర్లు పరిహారం చెల్లించనుంది గూగుల్ యాజమాన్యం. 60 రోజుల్లోగా ఈ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి స్థాయికి అనుగుణంగా జీతాలు ఇవ్వాలే తప్ప జెండర్ ఆధారంగా వాటిని నిర్ణయించకూడదని అంటున్నారు మహిళా ఉద్యోగులు. హెచ్‌ఆర్ పాలసీలను మార్చేందుకు నిపుణుల సలహాలు తీసుకుంటామని గూగుల్ వెల్లడించింది. ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. మహిళలకు, పురుషులకు సమానంగా జీతాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగవని స్పష్టంగా చెప్పింది గూగుల్. జీతాల విషయంలోనే కాకుండా బోనస్‌లు కూడా సమానంగా ఇస్తామని తెలిపింది. గతంలోనూ ఇదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంది గూగుల్. 2020లో వేలాది మంది ఉద్యోగులకు పనికి తగిన వేతనం ఇవ్వలేదన్న అసంతృప్తి వ్యక్తమవటం వల్ల 3,400 మందికి 4.4 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించింది గూగుల్. కార్మిక చట్టాన్నే ఆయుధంగా మార్చుకుని మహిళలందరూ ఏకమై పరిహారం పొందటం చర్చనీయాంశమైంది. ఈ దెబ్బకు మిగతా కంపెనీలు కూడా హెచ్‌ఆర్ పాలసీని మార్పులు చేసుకుంటాయేమో మరి.