German Foreign Minister:


పేటీఎమ్‌తో బిల్‌ కట్టేశారు..


జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ ఇండియాకు రెండ్రోజుల పర్యటన కోసం వచ్చారు. ఈ క్రమంలోనే బ్రేక్ టైమ్‌లో ఢిల్లీ వీధులన్నీ చుట్టేస్తున్నారు. సింస్ గంజ్ గురుద్వారాకు వెళ్లిన ఆమె...ఆ తరవాత చాందినీ చౌక్‌ మార్కెట్‌కు వెళ్లారు. ఢిల్లీలో ఈ ఏరియా చాలా ఫేమస్. ఈ మార్కెట్‌కు వెళ్లడమే కాదు. చాలా సేపు షాపింగ్ కూడా చేశారు అన్నలెనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులనూ కొనుగోలు చేశారు. మరి షాపింగ్ చేశాక బిల్ కట్టాలిగా. ఈ బిల్లింగ్ సమయంలోనే అందరినీ ఆశ్చర్యపరిచారామె. ఇండియాకు చెందిన డిజిటల్ పేమెంట్ వ్యాలెట్ Paytm ద్వారా ఆ షాప్ వాళ్లకు డబ్బులు చెల్లించారు. జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ ఆకెర్‌మాన్ ఈ విషయాన్ని ఫోటోలతో సహా ట్వీట్ చేశారు. "మొదటి రోజు చాలా ఉత్సాహంగా గడిచిపోయింది. సిస్ గంజ్ గురుద్వారాకు వెళ్లాం. ఆ తరవాత చాందినీ చౌక్‌లో షాపింగ్ చేశాం. పేటీఎమ్ ద్వారా డబ్బు చెల్లించాం" అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. "G20 ప్రతినిధులకు సాదరస్వాగతం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన డిజిటల్ పేమెంట్‌ సిస్టమ్‌ని వినియోగించండి. ఆనందించండి అంటూ చివర్లో PaytmKaro అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. G20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే...ఆయా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు భారత్‌కు రానున్నారు. జర్మన్ విదేశాంగమంత్రి అన్నలెనా బేర్‌బాక్‌ను కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిశారు. EVMల పని తీరుని ఆమెకు వివరించారు. హరియాణాలోని ఖోరి గ్రామాన్ని కూడా సందర్శించారు జర్మన్ మంత్రి. 










కీలక సమావేశాలు..


జీ20 ప్రెసిడెన్సీ సమయంలో భారత్.. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీలో జరగనున్న G-20 సమ్మిట్ భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల దేశాధినేతలు 
లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇండోనేసియా బాలీలో ఇటీవల జీ20 సదస్సు ముగిసింది. దీంతో 2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు ఇండోనేసియా అప్పగించింది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారు.


Also Read: వెలవెలబోతున్న ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్‌, తాళం వేసి వెళ్లిపోయారు!