Gangasagar Mela 2023:


గంగసాగర్ మేళా..


పశ్చిమ బెంగాల్‌లో గంగాసాగర్‌ మేళా జరుగుతున్న వేళ అనుకోని ఘటన జరిగింది. దాదాపు 600 మంది భక్తులు సముద్రంలో చిక్కుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పడవలో గంగాసాగర్‌కు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో పాటు సముద్ర అలలు పోటెత్తడం వల్ల పడవ బోల్తా పడింది. ప్రతి మకర సంక్రాంతికి గంగాసాగర్‌లో స్నానం చేసేందుకు లక్షలాది మంది ప్రజలు దేశ నలుమూలల నుంచితరలి వస్తారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 51 లక్షల మంది భక్తులు స్నానం ఆచరించారు. మరో 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కపిల్ ముని ఆశ్రమాన్ని సందర్శించిన తరవాత అందరూ పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో గుండె పోటు కారణంగా 7గురు మృతి చెందినట్టు తెలిపారు. 125 మంది భక్తులు అనారోగ్యానికి గురి కాగా...సాగర్ ద్వీపంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరో 25 మందిని కోల్‌కత్తాకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వర్చువల్‌గా ఈ ఘట్టాన్ని కోటి మందికిపైగా చూస్తున్నారు.  E-Snan సర్వీస్‌లను దేశవ్యాప్తంగా 7,780 మంది వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సర్వీస్‌ ఉపయోగించుకున్న వాళ్లకు గంగాసాగర్ నీళ్లను నేరుగా ఇంటికి పంపుతారు. దాదాపు 35 క్రిమినల్స్‌ని అరెస్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)తో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వందలాది మంది వాలంటీర్లూ భక్తుల్ని గైడ్ చేస్తున్నారు. వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  25 డ్రోన్‌లతో నిఘా పెట్టారు.