Gandhi Jayanti 2022: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కేవలం భారత్‌లోనే కాకుండా పలు దేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కన్పించడం విశేషం.


ఇదీ సంగతి


యునెస్కో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను శుక్రవారం ఐరాసలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహింసా లెక్చర్‌ సిరీస్‌ సందర్భంగా ఐరాసకు భారత ప్రతినిధి బృందం.. గాంధీజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించింది.






ఈ హోలోగ్రామ్‌ను హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ డిజిటల్‌ మ్యూజియం రూపొందించింది. ఇది గాంధీజీ హోలోగ్రామ్‌లో రెండో ఎడిషన్‌ అని ఈ మ్యూజియం డైరెక్టర్‌ బిరాడ్‌ యాజ్నిక్‌ తెలిపారు. డిజిటల్‌ గ్రాఫిక్‌ ఫైల్స్‌ను సంగ్రహించి వాటిని మోషన్‌ గ్రాఫిక్స్‌తో కలిపామని, దీంతో హోలోగ్రామ్‌ స్క్రిప్ట్‌ను చదివేలా చేశామన్నారు.


ఆ హోలోగ్రామ్‌ను చూడగానే అచ్చం జాతిపితే సమావేశాలకు వచ్చారనే భావన కలిగింది. ఈ హోలోగ్రామ్‌కు ఉన్న వాయిస్‌ ఓవర్‌.. విద్యపై మహాత్ముడి అభిప్రాయాలను పంచుకుంది. దీంతో గాంధీజీ స్వయంగా మాట్లాడుతున్నట్లు కన్పించింది.


నివాళులు


మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.







ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటోంది. మనం ఎప్పుడూ బాపు ఆశయాలను పాటిద్దాం. గాంధీజీకి నివాళిగా ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. "
-ప్రధాని నరేంద్ర మోదీ



Also Read: Mulayam Singh Yadav's Health: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు సీరియస్- ఐసీయూలో చికిత్స!