Madhya Pradesh Cleanest City: 



దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా నిలిచింది మధ్యప్రదేశ్. ఆ తరవాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఉన్నాయి. గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ సర్వే ఏటా చేపడుతుంది. ఈ సారి ర్యాంకుల ప్రకటనా కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. ఈ సర్వేకు సంబంధించి కొన్ని కీలక 
వివరాలేంటో చూద్దాం. 






1. దేశవ్యాప్తంగా స్వచ్ఛత విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ 100కి పైగా పురపాలక సంస్థలున్నాయి. 100 కన్నా తక్కువ పురపాలక సంస్థలున్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర, ఝార్ఖండ్ , ఉత్తరాఖండ్‌ నిలిచాయి. 


2. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌..వరుసగా ఆరోసారి స్వచ్ఛ నగరం అవార్డు దక్కించుకుంది. సూరత్, నవీ ముంబయి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10 స్వచ్ఛ నగరాల్లో భోపాల్‌కూ చోటు దక్కింది. "Self Sustainable City" అవార్డు దక్కించుకుంది ఈ నగరం. 


3. భారత్‌లో 40 లక్షలకుపైగా జనాభా ఉన్న "అత్యంత స్వచ్ఛమైన మెగా సిటీ"గా అవార్డు దక్కించుకుంది గుజరాత్‌లోని అహ్మదాబాద్.రాజ్‌కోట్‌ కూడా "Self Sustainable City" అవార్డు దక్కించుకుంది. 


4. టాప్‌ 10 నగరాల్లో ఢిల్లీ 9వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ అర్బన్ లోకల్ బాడీకి కూడా "Clean Small City" పురస్కారం దక్కింది. 


5. లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గనీ సిటీ టాప్‌లో ఉంది. 


6. పట్టణీకరణ ప్రణాళికలో ఎప్పుడూ ముందుండే ఛండీగఢ్ భారత్‌లో స్వచ్ఛమైన నగరాల జాబితాలో 12వ స్థానంలో ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో..."Fast Moving State" కేటగిరీలో అవార్డు దక్కించుకుందీ ఈ నగరం. 


7. ఈ సారి స్వచ్ఛ సర్వేక్షణ సర్వేను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. 100% డిజిటలైజేషన్‌లో భాగంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌నీ కేటాయించారు. 


8. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సర్వేగా రికార్డు సృష్టించింది..స్వచ్ఛ  సర్వేక్షణ్ సర్వే. 2016లో ఇది మొదలైందని..73 నగరాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఈ ఏడాది నాటికి దేశంలోని మొత్తం 4,355 నగరాల్లో సర్వే చేపడుతున్నారు. 


9. 8 ఏళ్ల క్రితం ఓ ప్రభుత్వ కార్యక్రమంగా మొదలైన స్వచ్ఛ భారత్ మిషన్...ఇప్పుడో ఉద్యమంగా మారిందని అంటోంది కేంద్రం. 


10. 153వ గాంధీ జయంతి జరుపుకునే ముందు రోజు ఈ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.