Bhuma Akhila Priya: తెలుగు దేశం పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్డు ఆదేశాల మేరకు అఖిల ప్రియ దంపతులను పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా కొత్తపల్లి వద్ద టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. అఖిల ప్రియ వర్గం తనపై దాడి చేసి హత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ ఏవీ సుబ్బారెడ్డి కేసు పెట్టారు. అఖిల ప్రియ కూడా తన చున్నీ లాగి, బట్టలు చించేశారని కేసు పెట్టారు. ఈ రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యాయత్నం కేసులో అఖిల ప్రియను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ నంద్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వారిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Also Read: అఖిలప్రియ, సుబ్బారెడ్డి వివాదంపై చంద్రబాబు సీరియస్ - త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఒకప్పుడు కలిసి మెలిసి, ఇప్పుడేమో ఉప్పు నిప్పు
భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి. భూమా మీదకి పోవాలంటే సుబ్బారెడ్డిని దాటిపోవాలి అనేంతలా వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిల ప్రియకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా ఏవీ సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని అఖిల ప్రియ వర్గం ఆరోపణ. కొన్ని ఆస్తుల వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని అఖిల ప్రియ అనుకుంటున్నారు. అలా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఒకప్పుడు కలిసి మెలిసి ఉన్న వారు.. ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయ్యారు.
Also Read: మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టు- ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం చేశారని అభియోగం!
ఇద్దరు టీడీపీ నేతల వైరంపై అధినేత ఆగ్రహం
నంద్యాలలో అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడిన ఆయన వివాదం పరిష్కారానికి సీనియర్లతో కమిటీ వేసినట్టు సమాచారం. లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతున్న నంద్యాలలో టీడీపీ అంతర్గత పోరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. లోకేష్‌కు స్వాగతం చెప్పే టైంలో సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గీయులు రోడ్లపై కొట్టుకోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివాదం పరిష్కారానికి తిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు.. నంద్యాలలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది. కొన్ని కొన్నిసార్లు టీడీపీ సమావేశాల్లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు వచ్చి కావాలని రెచ్చగొట్టే పనులు చేసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.