నంద్యాల టీడీపీలో మొదలైన అంతర్యద్దం అరెస్టుల వరకు వెళ్లింది. నిన్న రాత్రి  ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు భార్గవ్‌ రామ్‌, పీఏ మోహన్‌కు కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని నంద్యాల పీఎస్‌కు తరలించారు.  


నంద్యాల జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుుడు తారాస్థాయి చేరుకున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఈ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. 


Also Read: బుధవారం నుంచి 3 రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు - పూర్తి షెడ్యూల్ ఇలా


భూమా అఖిల ప్రియ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఏవీ సుబ్బారెడ్డిపై తిరగబడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి. లోకేష్‌ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా జరగడం టిడీపీ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. 






నారా లోకేష్ యువగళం యాత్రను నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే క్రమంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతల మధ్య సాగింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆయన్ని కొడుతున్న టైంలో పోలీసులు, ఆయన అనుచరులు ఆ దాడిని అడ్డుకున్నారు. స్వల్ప గాయాలతో సుబ్బారెడ్డి బయపడ్డారు. 


ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉన్నారు. సుబ్బారెడ్డిపై దాడి చేస్తున్న వ్యక్తిని మరో వ్యక్తి అడ్డుకుంటే ఆయన్ని కూడా చితక్కొట్టారు. ఇంతలో పోలీసులు వచ్చి సుబ్బారెడ్డిని పక్కకు తీసుకెళ్లడం విజువల్స్‌లో క్లియర్‌గా ఉంది. ఇరు వర్గాలను కూడా సర్దిచెబుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. 






తనపై జరిగిన దాడి కారణం అఖిల ప్రియ అంటున్నారు సుబ్బారెడ్డి. సత్తా ఉంటే డైరెక్ట్‌గా వచ్చి పోరాటం చేయాలని సవాల్ చేశారు. ఇరు వర్గాల ఘర్షణతో పాదయాత్రలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకొని సుబ్బారెడ్డిని అక్కడి నుంచి పంపేశారు. ఈ దాడితో అలర్ట్ అయిన పోలీసులు నంద్యాలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. 


Also Read: టీడీపీ, జనసేన కలిస్తే వారి ఆశలు గళ్లంతే! మూడు నియోజకవర్గాల నేతల్లో టెన్షన్ టెన్షన్


సుబ్బారెడ్డి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ ఉదయం భూమా అఖిల ప్రియను అరెస్టు చేశారు. ఆమెతోపాటు భర్త భార్గవ్‌రామ్‌, పీఏ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు దాడికి కారణాలపై ఆరా తీస్తున్నారు. దాడిలో వారి పాత్రపై ప్రశ్నిస్తున్నారు.