భార్యభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదంటూ ముంబై ఫ్యామిలీ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదును విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మహిళకు గ‌తేడాది న‌వంబ‌ర్ 22న పెళ్లయ్యింది. జనవరి 2న ఆమె తన భర్తతో కలిసి మహాబలేశ్వర్ వెళ్లింది. అక్కడ అతడు ఆమెతో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడు. అతడిని ప్రతిఘటించే సమయంలో ఆమె అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైనట్లు తెలిపారు. 


త‌న భ‌ర్త బ‌ల‌వంతంగా శృంగారం చేయ‌డం వల్లే ఈ స‌మ‌స్య వచ్చిందంటూ ఆమె ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన కొద్ది రోజులకే అత్తింటివారు వరకట్నం కోసం తనను వేదింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది. ఈ కేసును విచారించిన ముంబై అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి సంజ‌శ్రీ జే ఘ‌ర‌త్.. భార్యభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదని తీర్పు ఇచ్చారు. ఆమె పక్షవాతానికి గురికావడం దుర‌దృష్టకరమని, అందుకు బలవంతపు శృంగారం కారణం కాదని స్పష్టం చేస్తూ భర్తకు బెయిల్ మంజూరు చేశారు. 


Also Read: తల్లిని షూట్ చేసిన పసివాడు.. జూమ్ వీడియో కాల్‌లో రికార్డైన దారుణ ఘటన


2018లో కూడా గుజరాత్ హైకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. అయితే, నోటి ద్వారా లేదా అసహజ మార్గాల్లో భర్త లేదా భార్య శృంగారాన్ని కోరుకుంటే అది క్రూరత్వంతో సమానమని తెలిపడం గమనార్హం. ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదు విచారణలో భాగంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మనిషికి జంతువుకు మధ్య లైంగిక చర్య జరిగినా, ఇద్దరు పురుషుల మధ్య అసహజ మార్గంలో శృంగారం మినహా.. మిగతావీ ఏవీ సెక్షన్ 377 కిందకు రావాలని కోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 376లో వైవాహిక జీవితంలో అత్యాచారం గురించి పేర్కొనలేదని, ఆమె భర్త నోటి ద్వారా అసహజ శృంగారాన్ని కోరుకున్న నేపథ్యంలో సెక్షన్ 377 కింద పిటిషన్ దాఖలు చేయొచ్చని సూచించడం విశేషం.  


Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!


అయితే, ఈ ఏడాది జులై 30న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొంటే అది వైవాహిక అత్యాచారమేనని తెలిపింది. తన భార్య పంపిన విడాకుల నోటీసును సవాలు చేస్తూ ఓ వ్యక్తి ఫ్యామిలీలో కోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఎడప్పగత్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నేటి సామాజిక న్యాయశాస్త్రంలో భార్యభర్తలు సమాన భాగస్వాములని, భర్తకు భార్య మీద పెత్తనం చేసే హక్కు లేదని కోర్టు స్పష్టం చేయడం గమనార్హం.